చిన్నారులను అమ్మేసిన వ్యక్తికి ఉరిశిక్ష

29 Jan, 2016 17:08 IST|Sakshi
చిన్నారులను అమ్మేసిన వ్యక్తికి ఉరిశిక్ష

22 మంది శిశువులను కొనుగోలు చేసి మరో ప్రాంతంలో అమ్మేసిన వ్యక్తిని చైనాలో శుక్రవారం ఉరితీశారు. సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్లో ఉరి శిక్ష అమలు చేసినట్టు సుప్రీం పీపుల్స్ కోర్టు (ఎస్పీసీ) శుక్రవారం వెల్లడించింది.

2008 నుంచి 2013 వరకు టాన్ యాంగ్జీ (69) మరో ఇద్దరితో కలిసి నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ నుంచి పిల్లలను కొనుగోలు చేసి హెనన్ ప్రావిన్స్లో అమ్మేశాడు. ఇలా మొత్తం 22 మంది పిల్లలను అమ్మేసినట్టు తేలింది. 2014లో ఉరిశిక్ష విధించిన సమయంలో తాను తప్పేమీ చేయలేదని, పిల్లలు లేనివారికి మంచే చేశానని టాన్ సమర్థించుకున్నాడు. మగ శిశువులను 30,000 యువాన్లకు, ఆడ శిశువులను 16,000 యువాన్లకు కొనుగోలు చేసేవాడు. వారిని వెయ్యి నుంచి మూడు వేల యువాన్ల లాభంతో అమ్మేసేవాడని తేలింది.
 
గతంతో పోలిస్తే ఇప్పుడు చైనాలో మహిళలు, పిల్లల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. 2015లో ఇలాంటి కేసుల్లో మొత్తం 1,362 మందికి జైలుశిక్ష విధించారు. ఇది 2012తో పోల్చితే 50 శాతం తక్కువ.

మరిన్ని వార్తలు