ఆకాశంలో విమానం : కాక్‌పిట్‌లో టెన్షన్‌

4 Aug, 2018 13:22 IST|Sakshi
ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లో టెన్షన్‌

న్యూఢిల్లీ : విమానం గగనతలంలో ఉన్నప్పుడు ఏ సంఘటన జరిగినా అది అత్యంత ప్రమాదమే. విమానంలో ఉన్న ప్రయాణికులందరి ప్రాణాలు ఆ గాల్లోనే కలిసిపోతాయి. తాజాగా ఓ ఎయిరిండియా విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగానే ఓ వ్యక్తి, విమానాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన వ్యవస్థ కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి తెగ రచ్చ రచ్చ చేశాడు. దీంతో ఎయిరిండియా విమానంలో తీవ్ర ఆందోళన నెలకొంది. విమానంలో ఉన్న 250 మంది ప్రయాణికులు తీవ్ర టెన్షన్‌కు గురయ్యారు. 

మిలాన్‌ నుంచి ఎయిరిండియా విమానం ఏఐ 138 న్యూఢిల్లీకి బయలుదేరింది. గుర్‌ప్రీత్‌ సింగ్‌ అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో గాల్లో ఉండగానే రూట్‌ మార్చేసిన విమానం తిరిగి మిలాన్‌ వెళ్లిపోయింది. మిలాన్‌లో ల్యాండ్‌ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిని స్థానిక పోలీసులకు అప్పజెప్పింది. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుకున్న సమయానికే మిలాన్‌ నుంచి ఈ విమానం టేకాఫ్‌ అయినప్పటికీ,  ఓ విచిత్ర ప్రయాణికులు కాక్‌ పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని ఎయిరిండియా పేర్కొంది. అప్పటికే విమానం గంటకు పైగా ప్రయాణించిందని తెలిపింది. ఈ గందరగోళంతో తిరిగి మిలాన్‌ వెళ్లాలని నిర్ణయించాం. ఇలా రెండు గంటల 37 నిమిషాల పాటు విమానం ఆలస్యమైంది. ఢిల్లీకి వెళ్లడానికి మళ్లీ సెక్యురిటీ క్లియరెన్స్‌ ఇచ్చిన తర్వాతనే ఎయిర్‌క్రాఫ్ట్‌ తిరిగి బయలుదేరిందని ఎయిరిండియా ప్రకటన చేసింది.


 

మరిన్ని వార్తలు