ఆఫీసుకు లేట్‌ అవకూడదని రాత్రంతా నడిచాడు

23 Jul, 2018 22:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వృత్తి పట్ల నిబద్ధత, చేసే పని పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎంతటి కష్టాన్నయినా పడొచ్చని  ఒక అమెరికన్‌ యువకుడు నిరూపించాడు. సరైన సమయానికి గమ్యం చేరడం కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి ఉద్యోగం పట్ల తనకున్న అంకితభావాన్ని  చాటి చెప్పాడు. ఏ పనయినా గంటలు గంటలు లేట్‌ చేస్తూ బేఫికర్‌గా వ్యవహరించే వాళ్లకి అతని కథ ఒక కనువిప్పులాంటిది. . సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి, ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్న వాల్టర్‌ కథలోకి వెళితే ..

అమెరికాలోని అలబామా రాష్ట్రంలోని బిర్మింఘమ్‌కు చెందిన వాల్టర్‌ కార్  అమెరికా నావికాదళంలో చేరాలని కలలు కనేవాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాక ఎలాగైనా అందులో చేరాలని అనుకున్నాడు. ఇంతలో బెల్‌హాప్స్‌ అనే  ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ సంస్థలో ఉద్యోగం అవకాశం వచ్చింది. తన కలలు ఫలించే వరకు అందులో పనిచేయాలని అనుకున్నాడు. మొదటి రోజు ఉద్యోగంలో చేరుతున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. మర్నాడు  జాబ్‌లో చేరాల్సి ఉండగా ముందురోజు వాల్టర్‌కి అనుకోని అవాంతరం వచ్చింది. అతని కారుకి పెద్ద మరమ్మత్తు వచ్చింది. ఆ కారు వెంటనే బాగయ్యే అవకాశం కూడా లేదు. స్నేహితులెవరైనా కారు ఇస్తారేమోనని అడిగి చూశాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు.

తన ఇంటి నుంచి తాను విధులకు హాజరై సామాన్లు ప్యాక్‌ చేయాల్సిన కస్టమర్‌ జెన్నీ లేమీ ఇల్లు 32 కి.మీ. దూరం. ప్రజా రవాణా కూడా అందుబాటులో లేదు. దీంతో ఏం చెయ్యాలా అని తీవ్రంగా మధనపడ్డాడు. మొదటి సారి పనిలోకి వెళుతూ  ఒక్క నిముషం కూడా లేట్‌ అవకూడదని గట్టిగా అనుకున్నాడు. అన్ని కిలోమీటర్లూ  నడిచి వెళ్లాలని డిసైడ్‌ అయిపోయాడు. మరునాడు 8 గంటల్లోగా ఆ కస్టమర్‌ ఇంటి దగ్గర ఉండాలన్న పట్టుదలతో ముందు రోజు అర్థరాత్రి నుంచే నడక మొదలు  పెట్టాడు. అదేపనిగా నడక నడక నడక..వాల్టర్‌కి మరో ధ్యాస లేదు. సమయానికి కస్టమర్‌ దగ్గరకి వెళ్లాలి. తన కారణంగా కంపెనీకి ఒక్క మాట కూడా రాకూడదు. అదే లక్ష్యంగా నడవసాగాడు. అలా నాలుగైదు గంటల సేపు నడిచి గమ్య స్థానం ఇంకాస్త దూరం ఉందనగా వాల్టర్‌కి ఒక పోలీసు ఆఫీసర్‌ ఎదురయ్యాడు.

అతను అంత దూరం నుంచి ఎందుకు నడిచివస్తున్నాడో తెలుసుకొని విస్మయానికి లోనయ్యాడు. వెంటనే అతనికి అల్ఫాహారం పెట్టించి స్వయంగా తన వాహనంలో కస్టమర్‌ ఇంట్లో దింపాడు. తమ ఇంట్లో వస్తువులు ప్యాకింగ్‌ కోసం  ఒక ఉద్యోగి రాత్రంతా నడిచి వచ్చాడని తెలియగానే ఆ ఇంటి యజమానులు కూడా ఆశ్చర్య చకితులయ్యారు. వాల్టర్‌ కథని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా దానిని షేర్‌ చేశారు. బీ లైక్‌ వాల్టర్‌ హ్యాష్‌ట్యాగ్‌తో సాహో వాల్టర్‌ అంటూ సెల్యూట్‌ చేశారు. వాల్టర్‌ భవిష్యత్‌ కోసం, అతను కన్న కలల్ని సాకారం చేసుకోవడం కోసం సోషల్‌ మీడియా వేదికగా 75 వేల డాలర్ల నిధుల్ని సేకరించారు నెటిజన్లు..  చివరికి ఆ ప్యాకర్స్‌ అండ్‌ మూవర్స్‌ కంపెనీ సీఈవో ల్యూక్‌  మార్క్‌లిన్‌ కూడా వాల్టర్‌లోని సమయపాలన, పట్టుదలకి   ఫిదా అయిపోయి తాను వాడుకుంటున్న ఫోర్డ్‌ ఎస్కేప్‌ కారుని కానుకగా  ఇచ్చాడు.
 

మరిన్ని వార్తలు