‘మాంచెస్టర్‌’లో నలుగురి అరెస్ట్‌

25 May, 2017 01:14 IST|Sakshi
‘మాంచెస్టర్‌’లో నలుగురి అరెస్ట్‌

► మారణహోమం ఘటనలో 119కి పెరిగిన క్షతగాత్రులు
► మరిన్ని దాడులు జరగొచ్చని నిఘా వర్గాల అనుమానం


లండన్‌: మాంచెస్టర్‌ మారణహోమం కేసులో మరో నలుగురిని బ్రిటన్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి మొత్తం సంఖ్య ఐదుకు చేరింది. పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్‌లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్‌ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. బుధవారం దక్షిణ మాంచెస్టర్‌లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్‌ అబేదీ, ఉగ్రవాది సల్మాన్‌ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్‌ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్‌లోనే పుట్టి పెరిగారు. ఇటీవల పలుసార్లు లిబియా, సిరియాలకు వెళ్లి వచ్చాక ఉగ్రవాదులుగా మారారని బ్రిటన్‌ అధికారులు తెలిపారు. దాడి అనంతరం సల్మాన్‌ సిరియాకు వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మాంచెస్టర్‌ పేలుళ్లతో పలువురు ఇతరులకు కూడా సంబంధం ఉందనీ, సల్మాన్‌ ఒక్కడే ఈ దాడి చేసి ఉండడని పోలీసులు, బ్రిటన్‌ హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బ్రిటన్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సమాచారం రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.

మరిన్ని వార్తలు