‘తను మాకు దేవుడిచ్చిన బహుమతి’

29 Dec, 2018 13:20 IST|Sakshi

నవ మాసాలు మోసి కన్న తల్లికి బిడ్డ రంగు, రూపు గురించి పట్టింపు ఉండదు. వీటన్నింటికతీతంగా పిల్లల్ని ప్రేమించగలిగేది తల్లి మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న పిల్లలకంటే వైకల్యంతో పుట్టిన పిల్లల పట్లనే తల్లికి ఎక్కువ ప్రేమ, సంరక్షణ ఉంటాయి. లోకమంతా వారిని ఎగతాళి చేసినా, అసహ్యించుకున్నా.. తల్లి మాత్రం వారిని కడుపులో పెట్టి చూసుకుంటుంది. తనను ఏమన్నా ఊరుకుంటుంది కానీ తన పిల్లలను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోదు. వారికి తగిన విధంగా సమాధానం చెప్పి నోరు మూయిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. వైకల్యంతో పుట్టిన తన చిన్నారిని కామెంట్‌ చేస్తున్నవారికి ఆ తల్లి చెప్పిన సమాధానం నెటిజన్ల మనసు గెలవడమే కాక ట్రోలర్స్‌ నోరు మూయించింది. వివరాలు..

మాంచెస్టర్‌కు చెందిన నఫ్ఫి, రాచెలి గోల్‌మాన్‌ అనే దంపతులకు కూతురు జన్మించింది. అయితే ఆ బిడ్డ పుట్టడమే అరుదైన వ్యాధితో జన్మించింది. చూపు లేదు, వినపడదు.. కనీసం తనకు తానుగా శ్వాసించలేదు కూడా. అంతేకాక ఆ చిన్నారి కళ్లు ఉబ్బిపోయి.. తల కూడా అసమానంగా ఉండంటమే కాక వెన్నెముక కూడా సరిగా లేదు. కూతుర్నిని చూడగానే ముందు ఆమె తండ్రి కూడా భయపడ్డాడంట. కానీ అది కాసేపే.. వెంటనే చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడట. తమకు ఇలాంటి బిడ్డ పుట్టిందని ఆ తల్లిదండ్రులు బాధపడలేదంట. ఎందుకంటే.. గర్భంలో ఉన్నప్పుడే ఆ చిన్నారికి ఇలాంటి సమస్యలు ఉన్నాయని.. అబార్షన్‌ చేయించుకోమని సలహా ఇచ్చారంట వైద్యులు. కానీ వారు ఆ మాటలు పట్టించుకోలేదు.

బిడ్డను భూమ్మీదకు తీసుకురావాలనే నిర్ణయించుకున్నారు. చిన్నారి జన్మించిన తరువాత ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం కోసం తమ చిన్నారి ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో వారిని విపరీతంగా ట్రోల్‌ చేయడం ప్రారంభించారు నెటిజన్లు. ‘దెయ్యం’, ‘చంపేయండి’ అంటూ కామెంట్‌ చేశారు. ఈ ట్రోలింగ్‌కి ముందు బాధపడినా.. తరువాత కామెంట్‌ చేసేవాళ్లకు తగిన సమాధానం ఇచ్చారు. ‘ఈ చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవడం మాకు కష్టమే. కానీ తనను సృష్టించిన భగవంతుని మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. దేవుడెప్పుడు తప్పులు చేయడు. ఆయన మాకు కానుకగా ఇచ్చిన ఈచిన్నారిని ప్రేమగా సంరక్షిస్తాము’ అంటూ సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు