తెగిన ఎడమ చేతిని కుడికాలికి కుట్టి...

18 Jul, 2015 16:14 IST|Sakshi
తెగిన ఎడమ చేతిని కుడికాలికి కుట్టి...

బీజింగ్: సృష్టికి ప్రతిసృష్టి  చేసే  వైద్యులు దేవుడితో సమానమంటారు.  ఒక ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కార్మికుడి చేతిని వైద్యులు  రక్షించి  ఈ మాటను మరోసారి  రుజువు చేశారు.   చైనాలోని జో అనే కార్మికుడు విధి నిర్వహణలో  ఉండగా ప్రమాదానికి లోనయ్యాడు.  అతడి ఎడమ చేయి   మిషన్లో పడి  తెగిపడింది.  అతికించడానికి  వీల్లేకుండా  చర్మం అంతా  పిప్పి పిప్పి అయిపోయింది. దీంతో ఆ భాగంలోని నరాలు, టిష్యూలను రక్షించడానికి  జోకు శస్త్ర చికిత్స చేసేందుకు   వైద్యులు పూనుకున్నారు . మైక్రో బయాలజీ విభాగం అధిపతి డా.టాంగ్ జుయు నేతృత్వంలో ఈ అరుదైన శస్త్రచికిత్సను  నిర్వహించారు.   

వివరాల్లోకి  వెడితే ...చైనాలోని ఒక  ఫ్యాక్టరిలో  స్పిన్నింగ్ బ్లేడ్ మిషన్లో పడి జో ఎడమ చేయి  మణికట్టు పై భాగమంతా పూర్తిగా నలిగి పోయింది. గాయాల నుంచి అతను కోలుకునే దాకా తెగిపడిన  అవయవభాగాన్ని అతని కుడికాలుకి  జత చేసి ఆ భాగాన్ని  సజీవంగా నిలపగలిగారు.  ఒకనెల తర్వాత దాదాపు 10 గంటల పాటు   శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు విజయవంతంగా జో  చేతిని అతికించారు. అతడు ఇప్పుడిప్పుడే చేతివేళ్లను మెల్లిగా కదిలిస్తున్నాడని,  పూర్తిగా  స్వాధీనంలోకి రావడానికి కొంత సమయం పడుతుందని  వైద్యులు వెల్లడించారు.

ఈ సందర్భంగా వైద్యులు శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను  వెల్లడించారు. కార్మికుడి  ఎడమ చేయి వేళ్లు,  మిగిలిన కణాలకు రక్త ప్రసరణ జరిగి అది సజీవంగా ఉండేందుకే ఈనిర్ణయం తీసుకున్నామని డాక్లర్లు తెలిపారు. సాధారణంగా   తెగిపడిన  వేళ్లు, చేయి తదితర భాగాలకు సుమారు పది గంటల్లోపు తిరిగి రక్త ప్రసరణను పునరుద్ధరించాల్సిం ఉంటుందని  పేర్కొన్నారు. అయితే జో కోలుకునేసరికి సమయం పడుతుందనీ, అందుకే మిగిలిన భాగాన్ని ఇలా కాపాడాల్సి వచ్చిందని తెలిపారు. మరోవైపు ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ ద్వారా  రూపొందించిన  పుర్రెను  అమర్చి చైనా వైద్యులు చరిత్ర సృష్టించారు.  

మరిన్ని వార్తలు