జమ్మూకశ్మీర్‌ వెళ్లడం మానుకోండి!

3 Aug, 2019 19:34 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, టెర్రర్ అలర్ట్ నడుమ ఆ రాష్ట్రంలో పర్యటించేవారు ‘అప్రమత్తంగా ఉండాలని’ జర్మనీ, బ్రిటన్‌తో సహా ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు సూచించాయి.  ఉగ్ర మూకలు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా అమర్‌నాథ్ యాత్రికులను, పర్యాటకులను వీలైనంత త్వరగా లోయ నుంచి బయలుదేరాలని శుక్రవారం కోరిన సంగతి తెలిసిందే. అంతేకాక అమరనాథ్‌ యాత్రను ఉన్నపళంగా నిలిపివేసింది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. జమ్మూకశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండి, స్థానిక అధికారుల సలహాలను పాటించాలని తమ పౌరులకు పలు దేశాలు సూచనలు జారీ చేశాయి.  

ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ కశ్మీర్‌లోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ తమ దేశ పౌరులకు హెచ్చరిక జారీచేసింది. జనావాసంతో కూడిన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో బాంబు, గ్రెనేడ్ దాడులు, కాల్పులు లేదా కిడ్నాప్‌లతో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని, జాగ్రత్త వహించాలని కోరింది.

‘లద్దక్‌లోని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఒంటరిగా లేదా గుర్తు తెలియని గైడ్‌తో అస్సలు ప్రయాణించొద్దు. పాకిస్తాన్‌, లద్దక్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో తక్షణ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి’ అని జర్మనీ ప్రభుత్వం తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది. యుకే, జర్మనీ తమ పౌరులకు ప్రయాణ సలహా ఇచ్చిన కొద్ది నిమిషాల తరువాత, ఆస్ట్రేలియా కూడా జమ్మూ కశ్మీర్‌కు వెళ్లవద్దని తన పౌరులకు సూచించింది.

మరిన్ని వార్తలు