ఓ వలసజీవి దీనగాథ

19 Mar, 2018 12:38 IST|Sakshi
సిల్వానా

హూస్టన్‌: వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు.  ట్రంప్‌ ఎత్తుగడలతో ఎన్నో కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలు వేరవుతున్నారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిందనే కారణంగా తన ముగ్గురు పిల్లలకు దూరం అయిన ఒక తల్లి దీనగాథ ఇది.

బతుకుదెరువు కోసం సుమారు 3 వేల మైళ్లు ప్రయాణం చేసి భర్తను కలుసుకునేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికాకు బయలుదేరింది సిల్వానా. అప్పటికే తన భర్త దుండగుల చేతిలో చిక్కి చావు నుంచి తప్పించుకుని అఙ్ఞాతంలో నివసిస్తున్నాడని ఆమెకు తెలియదు. మధ్య అమెరికాలోని ఈఐ సెల్వడార్‌కు చేరుకుంది. గన్‌ కల్చర్‌కు చిరునామాగా ఉన్న అమెరికా దేశాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని ఎందుకు చంపుతారో కూడా తెలియదు. సిల్వానా కూడా సరిగ్గా అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టాక్సీ దిగగానే వారిని అడ్డుకున్న ఓ గ్యాంగ్‌ ఆమె పెద్ద కుమారుడికి తుపాకీ గురిపెట్టింది. కానీ అదృష్టవశాత్తూ అందులోని బుల్లెట్లు అయిపోవడంతో నిన్ను వదిలేస్తున్నామంటూ గ్యాంగ్‌స్టర్‌ వెళ్లిపోయాడు. కానీ వారిలో భయం మాత్రం పోలేదు. అదే తన పిల్లలతో గడిపే చివరి రోజు అవుతుందని ఆమె ఊహించలేదు.

గ్యాంగ్‌ నుంచి ఎలాగోలా తప్పించుకుని తనవారిని కాపాడుకుంది. మెక్సికో సరిహద్దులో వలసదారులతో కలిసి చేసిన ప్రయాణం ఆమెకు తన పిల్లల్ని దూరం చేసింది.. ఆమెను జైలు పాలు చేసింది. ఇమ్మిగ్రేషన్‌ అధికారులను చూడగానే వలసదారులు అక్కడ ఉన్న ఎత్తైన గోడను దాటి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో, సిల్వానా కూడా తన పిల్లలిద్దరినీ గోడ అవతలి వైపు పంపివేసింది. మూడేళ్ల కుమారున్ని గోడపై నుంచి విసిరివేయగా అవతలవైపు ఉన్నవారు బ్లాంకెట్‌ సాయంతో అతన్ని పట్టుకున్నారు.

‘ఎప్పుడైతే పిల్లలు దూరమయ్యారో అప్పుడే నా ఆత్మ నన్ను వదిలిపోయిందని’ ఒక ఇంటర్వ్యూలో తన చేదు ఙ్ఞాప​కాలను గుర్తుచేసుకుంది సిల్వానా. ఆమెను అక్రమవలసదారుగా గుర్తించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అమెరికా చట్టాల ప్రకారం ఆమెను నిర్బంధించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఇలాంటి సంఘటనలు అధికమయ్యాయి. తల్లిదండ్రుల నుంచి పిల్లలను దూరం చేయడం అన్యాయమని, అమెరికా కుటుంబ చట్టాల ప్రకారం ఇది విరుద్దమని డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధులు దేశ భద్రత విభాగానికి లేఖ రాశారు. తాజాగా ఓ ఏడేళ్ల అమ్మాయిని తల్లికి దూరం చేశారని ఇమ్మిగ్రేషన్‌ అధికారులపై ఆరోపణలు రావడంతో.. పిల్లల అ‍క్రమ రవాణాను అరికట్టేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇటువంటి విధానాల వల్ల ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులకు దూరమవుతున్నారని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీ యూనియన్‌ డిప్యూటీ డైరెక్టర్ లీ గెలెంట్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి దూరమై..
వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు ఒక హోటల్‌కి తీసుకువెళ్లేందుకు వ్యాన్‌ ఎక్కించారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. వారిలో సిల్వానా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న తమ్ముడిని ఒడిలో పెట్టుకుని, చెల్లిని ఓదారుస్తూ, నాన్న కనిపిస్తాడేమోనన్న ఆశతో ఆ రాత్రంతా నిద్రపోలేదు సిల్వానా పెద్ద కొడుకు. హోటల్‌కు చేరుకోగానే తమ తండ్రి వద్దకు తీసుకువచ్చారేమో అని సంబరపడింది సిల్వానా కూతురు. కానీ ఆమె ఆనందం అంతలోనే ఆవిరైంది. అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరు గదులు కేటాయించడంతో సోదరులకు కూడా దూరం అయింది. కేవలం భోజన సమయాల్లో వారిని చూసేందుకు వీలయ్యేది. అన్నను కలిసిన ప్రతీసారీ ఆమె అడిగే ఒకే ఒక ప్రశ్న అమ్మ ఎక్కడా అని. అమ్మ కావాలి అంటూ ఏడ్చే చిన్నారి తమ్ముడిని ఎలా ఓదార్చాలో అర్థంకాక.. చెల్లికి సమాధానం చెప్పలేక ఎంతో కుమిలిపోయేవాడు ఆమె పెద్ద కొడుకు. తల్లి ఇచ్చిన ఫోన్‌ బుక్‌ను పోగొట్టుకున్నాడు. తండ్రిని కలుసుకునేందుకు మార్గాల కోసం అన్వేషించాడు. ఫేస్‌బుక్‌ ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దామనుకుంటే అక్కడ యాక్సెస్‌ లేదని అధికారులు చెప్పడంతో నిరాశ చెందాడు. చేసేదేమీలేక చుట్టూ ఉన్న వారితో కొత్త స్నేహాలు ఏర్పరచుకున్నారు. కొద్దిరోజులకే వారిని కూడా ఎప్పటికపుడు తమ దేశాలకు తిరిగి పంపించేయడంతో మళ్లీ ఒంటరివారిగా మిగిలేవారు సిల్వానా పిల్లలు. తల్లి కోసం ఏడ్చిన ఆమె కూతురు.. మరో నాలుగేళ్ల చిన్నారిని తల్లిలా లాలించడం నేర్చుకుంది. రోజులు గడుస్తున్నా తల్లిజాడ తెలియక వెక్కి వెక్కి ఏడ్చే ఆ చిన్నారులది అరణ్యరోదనగానే మిగిలింది.

21 రోజుల నిరీక్షణ అనంతరం..
తండ్రి యులియో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పిల్లలతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం సిల్వానాలో ఆశలు చిగురించాయి. కానీ చిన్న కొడుకు మాత్రం ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది. హుస్టన్‌ ఎయిర్‌పోర్టులో పిల్లల్ని రిసీవ్‌ చేసుకోవాలని అధికారులు సమాచారంతో అందిచడంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తల్లి కూడా ఎయిర్‌పోర్టుకు వస్తుందని ఎదురుచూసిన చిన్నారులకు నిరాశే ఎదురైంది.

నిర్బంధం నుంచి విముక్తి..
అరిజోనాలో సిల్వానాను నిర్బందించారు అధికారులు. తన పిల్లల గురించి అడిగిన ప్రతిసారీ ఆమెకు ఎటువంటి సమాధానం లభించేది కాదు. కొన్నాళ్ల తర్వాత ఆమెను తిరిగి పంపించేందుకు, వలసదారులతో కలిసి విమానం ఎక్కించారు. ‘మిగతావారంతా సంతోషంగానే ఉన్నారు. నేను మాత్రమే పిల్లలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్నానని కుమిలిపోయింది సిల్వానా. నిర్భంధంలో ఉన్నప్పటికీ భర్తను కలుసుకోగలిగింది కానీ.. పిల్లల జాడ మాత్రం తెలుసుకోలేపోయింది. తనలాగే పిల్లలకు దూరమైన 8 మంది తల్లుల్ని కలుసుకుంది సిల్వానా. సెల్వడార్‌లో తమను బెదిరించి, తమ జీవితాలు చెల్లాచెదురవడానికి కారణమైన దుండగులను గుర్తుపట్టి పోలీసులకు సాయం చేసింది. 2000 డాలర్ల పెనాల్టీ విధించి ఆమెకు విముక్తి కలిగించారు అధికారులు.

అంతులేని ఆనందంతో..
రిలీజ్‌ అయిన వెంటనే పిల్లల్ని చూసేందుకు ఆత్రుతగా బయలుదేరింది. కానీ తనను పిల్లలు క్షమిస్తారా.. మూడేళ్ల పసివాడు కనీసం గుర్తిస్తాడా అనే సందేహాలతో సతమతమైంది. పెద్ద వాళ్లిద్దరూ తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్న కుమారుడు మాత్రం ఎంతగా ప్రయత్నించినా తల్లి దగ్గరకు రాలేదు. సోదరుడి వద్దే ఉండిపోయాడు. ఆ చిత్రాన్ని చూసిన యులియో కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యాడు.

మరిన్ని వార్తలు