కరోనాను జయించిన స్పెయిన్‌ బామ్మ

13 May, 2020 08:35 IST|Sakshi
మరియా బ్రాన్యాస్ (ఫైల్‌ ఫోటో)

కరోనా వైరస్‌ భయంతో ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో గడుపుతున్న వేళ అందరికీ ఊరటనిచ్చే వార్త ఇది. ప్రధానంగా, వృద్ధుల పాలిట ప్రమాదకరంగా పరిణమించిన కోవిడ్‌​-19 మహమ్మారిని స్పెయిన్‌కు  చెందిన 113 ఏళ్ల బామ్మ  జయించారు.  కొన్ని వారాల  పాటు ఒంటరిగా ఐసోలేషన్‌లో పోరాడి (ఐసోలేషన్‌ వార్డులో కేవలం ఒక్కరు మాత్రమే ఆమెను పరీక్షించే వారు)  సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి కోలుకున్నారు. దీంతో కరోనాను జయించిన  అతి పెద్ద వయస్కురాలిగా మరియా బ్రాన్యాస్ నిలిచారు.

అమెరికాలో జన్మించిన మరియా బ్రాన్యాస్ ఏప్రిల్‌లో  వైరస్‌ బారిన పడ్డారు. గత 20 ఏళ్లుగా ఓల్ట్‌ ఏజ్‌ హోంలో వుంటున్న ఆమెకు వ్యాధి సోకింది. దీంతో  ఐసోలేషన్‌లో కొన్ని వారాలు ఒంటరిగా గడిపినా, మనో ధైర్యంతో  నిలిచి గెలిచారు. పలువురికి  స్ఫూర్తిగా నిలిచారు.

గతంలో ఎన్నో ఉపద్రవాలను చూసి, స్పెయిన్లో ఓల్డెస్ట్‌  మహిళగా ప్రసిద్ధి చెందిన బ్రాన్యాస్ ‌తాజాగా కరోనాపై కూడా ఒంటరిగా పోరాడి, ఆరోగ్యంతో తిరిగి రావడం సంతోషంగా వుందని  బ్రాన్యాస్ కుమార్తె రోసా మోరెట్  ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆమెకు చికిత్స అందించిన నర్సు కూడా బ్రాన్యాస్‌ కోలుకోవడం చాలా ఆనందానిచ్చిందన్నారు. మరియాకు అభినందనలు తెలిపిన ఓలోట్‌లోని శాంటా కేర్ హోం‌ సిబ్బంది, తమ హోంలో కొంతమంది కరోనాకు బలయ్యారని తెలిపారు. మరోవైపు తనకు వ్యాధి నయమయ్యేలా చేసిన సిబ్బందికి మరియా కృతజ్ఞతలు తెలిపారు.

ముగ్గురు బిడ్డల  తల్లి అయిన బ్రాన్యాస్ మార్చి 4, 1907న శాన్‌ఫ్రాన్సిస్కోలో జన్మించారు. ఈమె తండ్రి జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రాన్యాస్ తన కుటుంబంతో కలిసి పడవలో  స్పెయిన్‌కు వలస వెళ్లారు.  అంతేకాదు ఆమె జీవిత కాలంలో 1918-19లో ప్రపంచాన్ని కదిలించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారిని, స్పెయిన్  అంతర్యుద్ధాన్ని చూశారు.

కాగా మహమ్మారి బారిన పడిన దేశాలలో స్పెయిన్ ఒకటి. మార్చి నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమలవుతోంది. అక్కడి ఆరోగ్యమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు  27వేల కరోనా మరణాలు సంభవించాయి. 

మరిన్ని వార్తలు