ఈ వధూవరులను గుర్తించండి!

19 Nov, 2015 18:18 IST|Sakshi
ఈ వధూవరులను గుర్తించండి!

లండన్: జలకాలాటలలో ఏమి హాయిలే అలా...అంటూ కరీబియన్ సముద్రంలో భుజాల వరకు నీటి మునిగి చెట్టాపట్టాలేసుకొని ముందుకు సాగిపోతున్నారు ఆ వధూవరులు. స్వచ్ఛమైన నీటి అడుగున ‘స్టింగ్‌రేస్ (పొడవాటి సన్నటి తోకగల చేపలు)’ గుంపులు గుంపులుగా దూసుకొస్తున్నా లెక్కచేయకా, గగన సీమలో పోటీపడి కమ్ముకొస్తున్న మంచు మబ్బులను చూస్తూ తన్మయత్నంలో తేలిపోతున్న వధూవరుల దృశ్యాన్ని జెన్నీ స్టాక్ అనే ఓ మెరైన్ ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించారు. ఆ జంట అనుమతితోనే ముచ్చటైన వాళ్ల ఫొటోలు పలు తీశానని, వాళ్లకు ఈ ఫొటోలు అందజేయాలని ఆశిస్తున్నానని, అయితే వారు ఎక్కడున్నారో, వారి చిరునామా ఏమిటో తనకు తెలియదంటూ ఆమె ఇప్పుడు ప్రముఖ సామాజిక వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’ను ఆశ్రయించారు. వాళ్లను గుర్తించిన వెబ్‌సైట్ యూజర్లు దయచేసి వారి కాంటాక్ట్‌ను తనకు అందజేయాల్సిందిగా కోరుతున్నారు.

 ‘స్వచ్చమైన కరీబియన్ సముద్రంలో మెరైన్ లైఫ్‌పై ఫొటోలు తీసేందుకు నేను గత మే నెలలో డొమెనికన్ రిపబ్లిక్‌కు వెళ్లాను. నీటి మునిగి నేను ఫొటోలు తీస్తుండగా, హఠాత్తుగా నా కెమెరా ముందుకు నవ వధూవరులు వచ్చారు. అప్పటికీ పెళ్లి దుస్తుల్లోనే ఉన్న పెళ్లి కూతురును చూసి ముచ్చటేసింది. ముళ్ల చాకు లాంటి తోకలో విషం గల స్టింగ్‌రేస్ (ఆపద ఎదురైనప్పుడు మాత్రమే ఆ చేపలు మనుషులపై దాడులు చేస్తాయి)ను కూడా లెక్కచేయకుండా వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగిపోవడం మరింత ఆశ్చర్యం వేసింది. అందుకే వారి అనుమతితో వారి ఫొటోలు తీశాను.

వారికి నన్ను కాంటాక్టు చేయాల్సిందిగా పేరు, ఊరు, ఫోన్ నెంబర్ చెప్పాను. అలల హోరులో వారికి నా మాటలు వినపడకపోవచ్చని ఇప్పుడనిపిస్తోంది. ఆ నవ వధూవరులు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఇంతకాలం నిరీక్షిస్తూ వచ్చాను. కనీసం వారు ఏ దేశస్థులో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ సాయం అర్థిస్తున్నాను. లండన్‌లోని లంకాషైర్‌లో నివసిస్తున్న నేను మెరైన్ ఫొటోగ్రాఫర్‌ను. నా ఫేస్‌బుక్ పేజీని సులభంగానే గుర్తించవచ్చు’ అంటూ ఆమె సోషల్ వెబ్‌సైట్ యూజర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు