జుకర్‌బర్గ్‌ కథ ఇంకా మిగిలే ఉంది ..

12 Apr, 2018 08:04 IST|Sakshi

ఎక్కడా తడబాటు లేదు. కంగారు అసలే లేదు. చాలా కూల్‌గా, కామ్‌గా అంతకు మించి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌.  అమెరికా కాంగ్రెస్‌  అడిగిన ప్రశ్నలన్నింటికీ చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చి తొలిరోజు విచారణను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.  చేసిన తప్పుల్ని ఒప్పుకుంటూ, భవిష్యత్‌లో ఇంక తప్పులు జరగవన్న హామీలు ఇస్తూ వినయవిధేయతల్ని ప్రదర్శించారు. ఫేస్‌బుక్‌ని తానే నిర్వహిస్తున్నానని అందులో జరిగే తప్పొప్పులకు తనదే బాధ్యతని స్పష్టం చేశారు. దాదాపు 5 గంటల సేపు సాగిన విచారణలో అమెరికా సెనేటర్లు జుకర్‌బర్గ్‌ను పెద్దగా ఇరుకున పెట్టే ప్రశ్నలు అడగలేదు కానీ కొన్నిఅంశాల్లో కాస్త గట్టిగానే నిలదీశారు.

ఫేస్‌బుక్‌ వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన గోప్యత విధానాలు సరిగా లేవంటూ సెనేటర్లు అడిగిన ప్రశ్నలకు జుకర్‌బర్గ్‌ సరైన రీతిలో స్పందించలేకపోయారు. రాత్రి మీరు ఏ హోటల్‌లో బస చేశారో చెప్పగలరా అని సెనేటర్‌ డిక్‌ డర్బిన్‌ ప్రశ్నించారు. దానికి సమాధానం ఇవ్వడానికి జుకర్‌బర్గ్‌ తటపటాయించడంతో ఫేస్‌బుక్‌లో వ్యక్తిగత సమాచారం గోప్యత అలాంటిదేనంటూ ఆసెనేటర్‌ రిటార్ట్‌ ఇచ్చారు. ఇక ఫేస్‌బుక్‌ స్వీయనియంత్రణ పాటిస్తుందన్న నమ్మకం తమకు లేదని అత్యధిక సెనేటర్లు అభిప్రాయపడ్డారు. అలాగని ఫేస్‌బుక్‌ని నియంత్రించాలని తాము భావించడం లేదని భవిష్యత్‌లో జుకర్‌బర్గ్‌ తీసుకునే చర్యలపైనే ఆ విషయం ఆధారపడి ఉంటుందని వారు తేల్చేశారు. ఇక ఈ విచారణలో ఫేస్‌బుక్‌ గుత్తాధిపత్యం అనే అంశం కూడా ప్రధానంగా వెలుగులోకి వచ్చింది.

200 కోట్ల మంది వినియోగదారులు ఉన్న ఫేస్‌బుక్‌కు ప్రత్యామ్నాయం ఇన్‌స్టాగ్రామ్‌.. అది కూడాఫేస్‌బుక్‌ చేతిలోనే ఉంది. 2017 సంవత్సరంలో వచ్చిన డిజిటల్‌ రెవిన్యూలో 87 శాతం ఈ రెండింటికే వచ్చింది. ఇవన్నీ ప్రస్తావించిన సెనేటర్లు సోషల్‌ మీడియాలో మీది గుత్తాధిపత్యమే కదా?  అని అడిగిన ప్రశ్నకు జుకర్‌బర్గ్‌ అలాంటిదేమీ లేదంటూ గణాంకాలతో సహా వివరించారు. ఎన్ని రకాల యాప్స్‌ ద్వారా బంధువులు, స్నేహితులతో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవచ్చో ఆయన వివరించారు.  ఇక ఫేస్‌బుక్‌లో రాజకీయంగా, వర్గాల వారీగా విద్వేషపూరిత వ్యాఖ్యల్ని, సమాచారాన్ని తొలగించడం చాలా సంక్లిష్టమైన విషయమని జుకర్‌బర్గ్‌ అంగీకరించారు. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకొని మరో అయిదు, పదేళ్లలో దానిని సాధిస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుల డేటాకు సంబంధించి ట్రోజాన్‌ హార్స్‌ యాప్స్‌ ద్వారా ఫేస్‌బుక్‌ వినియోగదారులకు ఎంత విధ్వంసం జరిగిందో సరిగా అంచనా వెయ్యలేమని జుకర్‌బర్గ్‌ తేల్చి చెప్పేశారు. మైక్రోఫోన్ల ద్వారా ఫేస్‌బుక్‌ వినియోగదారుల సంభాషణలను తాము ఎప్పటికీ వినమని స్పష్టం చేశారు.

ఫేస్‌బుక్‌లో ఇక ఇవి చేయలేం
ఫేస్‌బుక్‌లో వినియోగదారుల భద్రతకు సంబంధించి కొన్ని కీలకమైన చర్యలు తీసుకున్నామని జుకర్‌బర్గ్‌ వివరించారు. అవేంటంటే
ఫోన్‌ నెంబర్లు, ఈ మెయిల్‌ ఐడీల ద్వారా ఇతర వ్యక్తుల్ని  ఇక మనం సెర్చ్‌ చేయలేం.
వేరే వ్యక్తుల పోస్టులను షేర్‌ చేయడానికి కొన్ని పరిమితులు విధించారు.  గతంలో మాదిరిగా ఏ సమాచారాన్నైనా మనం షేర్‌ చేయడం ఇకపై అంత సులభం కాదు.
యాప్‌ డెవలపర్స్‌ ఇక ఫేస్‌బుక్‌లో డేటాను వినియోగించలేరు. ఇతర యాప్‌లకు ఎఫ్‌బీ నుంచి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుతుంది.
వినియోగదారుల వ్యక్తిగతం సమాచారం, వారు పెట్టిన పోస్టులను డెవలపర్స్‌ చూడడానికి ఇక చాలా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతరుల చేతికి సమాచారం వెళ్లకుండా దీనిపై ఎన్నో పరిమితులు విధించారు.

భారత్‌ ఎన్నికల సమగ్రతని కాపాడతాం
భారత్‌లో ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఉందో తమకు తెలుసునని, ఆ ఎన్నికల సమగ్రతని కాపాడడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామని  జుకర్‌బర్గ్‌ స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పాకిస్థాన్, బ్రెజిల్, మెక్సికో దేశాల్లో జరగబోయే ఎన్నికల్లో డేటా లీకేజీ జరగకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 13.3 కోట్ల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ఫలితాల్ని ఎలా తారుమారు చేస్తారోనన్న ఆందోళన నెలకొని ఉంది. అయితే కృత్రిమ మేధ సాయంతో ఫేక్‌ అకౌంట్లను తొలగించడంతో పాటు ఫేస్‌బుక్‌ భద్రతను ఎప్పటికప్పుడు పటిష్టం చేయడానికి  20 వేల మంది సిబ్బందితో  ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జుకర్‌బర్గ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సమాచారాన్ని సురక్షితంగా ఉంచడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చారు.

ముందే ప్రశ్నలు తెలుసా ?
అమెరిక సెనేట్‌ అడిగిన ప్రశ్నలు జుకర్‌బర్గ్‌కు ముందే తెలుసునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ సందర్భంగా ఏ దశలోనూ ఆత్మరక్షణలో పడకుండా సోషల్‌ మీడియా అనేది ప్రపంచ దేశాలను కలిపే వారధిలా ఎలా పనిచేస్తోందో జుకర్‌బర్గ్‌ వివరించిన తీరు చూసిన వారికి  అవే అనుమానాలు వస్తున్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనాన్ని వెల్లడించింది. అంతేకాదు విచారణ ఎదుర్కోవడానికి ముందు జుకర్‌బర్గ్‌  తన లాబీయింగ్‌లో భాగంగా  చాలా మంది సెనేటర్లను కలుసుకున్నారు. ఆ సమయంలో వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, డేటా లీకేజీపై వారి ఆందోళన చూసిన జుకర్‌బర్గ్‌ ప్రశ్నల విషయంలో ఒక అంచనాకు వచ్చి ఉంటారని ఆ కథనం పేర్కొంది. జుకర్‌బర్గ్‌ను విచారించిన  సెనేట్‌ జ్యుడీషియరీ, కామర్స్‌ కమిటీలకు ఫేస్‌బుక్‌ నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఈ రెండు కమిటీల్లో సభ్యులకు 2007వ సంవత్సరం నుంచి 6.4 లక్షల అమెరికా డాలర్లు విరాళం రూపంలో అందాయి. అందుకే జుకర్‌బర్గ్‌ విచారణ అంత సంక్లిష్టంగా సాగలేదని అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది.

మరిన్ని వార్తలు