ఫేస్‌బుక్‌ సీఈఓపై జోకులే జోకులు..

11 Apr, 2018 15:07 IST|Sakshi

రోబోలా ఉన్నారంటూ నెటిజన్ల ట్వీట్లు

డేటా చోరిపై అమెరికన్‌ కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు జవాబులు చెప్పడం చాలా కష్టమైంది. 44 మంది సెనేటర్లు దాదాపు 5 గంటలకు పైగా జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలపై సోషల్‌ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. జుకర్‌బర్గ్‌ ఓ రోబో అని అందుకు ఆయన నేడు సెనేటర్లను ఎదుర్కొన్న తీరే అందుకు నిదర్శనమని పోస్టులు చేస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో టీ షర్ట్‌, జీన్స్‌ ధరించే జుకర్‌బర్గ్‌ బుధవారం మాత్రం అధికారిక సమావేశాల్లో పాల్గొనే వ్యక్తిగా దర్శనమిచ్చారు. 

సెనెటర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు అడగగా చాలా వాటికి మౌనం వహించిన జుకర్‌బర్గ్‌.. చివరికి తన వ్యక్తిగత సమాచారాన్ని చెప్పడానికి నిరాకరించారు. పలు పర్యాయాలు క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. జుకర్‌బర్గ్‌ హావభావాలను గమనించిన మైక్‌ టోక్స్‌ అనే నెటిజన్‌.. ఫేస్‌బుక్‌ సీఈఓ రోబో అని చెప్పడానికి నూటికి నూరుపాళ్లు అవకాశం ఉందని ట్వీట్‌ చేశారు.మనుషులు మామాలుగా నీళ్లు తాగుతారంటూ జుకర్‌బర్గ్‌ నీళ్లుతాగే విధానాన్ని జుకర్‌బర్గ్‌ 2020 అనే ఖాతా నుంచి ట్వీట్‌ చేశారు. రోబో ఓ కంపెనీకి సీఈఓ అంటూ కొందరు జోకులు పేల్చుతున్నారు.

రోబోలా కనిపించటమే కాదు రోబోలా పనులు చేస్తున్నారని.. అందుకే ఫేస్‌బుక్‌ ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని జుకర్‌బర్గ్‌ అమ్ముకుంటున్నారని విమర్శిస్తూ మరికొందరు ట్వీట్లు చేశారు. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో జుకర్‌బర్గ్‌ సతమతమవుతున్నారు. దాదాపు 8.7  కోట్ల మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావితం చేసేందుకు వాడారని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు