మ్యారీడ్ సండే.. ఫైర్డ్ మండే..

4 Jul, 2015 11:07 IST|Sakshi
మ్యారీడ్ సండే.. ఫైర్డ్ మండే..

చికాగో: ఇల్లు అలకగానే పండగకాదు అనే పాత సామెత అమెరికన్ ఎల్జీబీటీ (లెస్బియాన్స్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్) ల విషయంలో మరోసారి రుజువైంది. ఓ ఆదివారంనాడు ఎంతో సంతోషంగా గే పార్ట్నర్ను పెళ్లి చేసుకున్న కారణంగా సోమవారం నాటికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం అమెరికాలో! అలా పుట్టిందే మ్యారీడ్ సండే.. ఫైర్డ్ మండే ఉవాచ.

ఆ విధంగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. రెండు వారాలు తిరగకముందే బుట్టదాఖలయ్యే పరిస్థితులు తలెత్తాయి. సుప్రీంకోర్టు తీర్పు మతిలేనిదని బాబీ జిందాల్ తోపాటు మరికొందరు కీలక నేతలు బాహాటంగానే విమర్శలకు దిగారు. ఆ క్రమంలోనే లూసియానా సహా 13 రాష్ట్రాల్లో సుప్రీం తీర్పు అమలు కావడంలేదు. అంతేకాదు.. సుప్రీం తీర్పు తరువాత ఎల్జీబీటీలపై వివక్ష రెట్టింపు అయిందికూడా.

ఈ ఉదంతాలకు పరాకాష్టలాంటి ఘటన శనివారం టెన్నెస్సీలో చోటుచేసుకుంది. ఆ సిటీలో ప్రముఖ సంస్థగా వెలుగొందుతున్న ఓ హార్డ్వేర్ సంస్థ 'గేలకు ప్రవేశం లేదు' అని గేటు ముందు బోర్డు పెట్టేసింది. ఈ చర్యను గేలందరూ గర్హిస్తున్నారు. '50 ఏళ్లు పోరాడిసాధించుకున్న హక్కులు నీరుగారిపోకుండా ఉండాలంటే ఎల్జీబీటీలో మరో మహోద్యమానికి సిద్ధపడక తప్పదు' అని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రొగ్రెస్ రీసెర్చర్ సారా మెక్బ్రైడ్ అంటున్నారు. పలు రంగాలకు చెందిన మేధావులు ఆమె ఉవాచను సమర్ధిస్తున్నారు.

మరిన్ని వార్తలు