ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని కుమార్తె!

24 Oct, 2019 14:16 IST|Sakshi

లాహోర్‌ : తన తండ్రిని చూడటానికి ఆస్పత్రికి వెళ్లిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియమ్‌ నవాజ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తండ్రికి చికిత్స చేస్తున్న ఆస్పత్రిలోనే చేర్పించారు. అనేక పరిణామాల నేపథ్యంలో మనీలాండరింగ్‌ కేసులో నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియమ్‌ నవాజ్‌కు కూడా స్థానిక కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవాజ్‌ షరీప్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను సోమవారం రాత్రి లాహోర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. బ్లడ్‌ ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే నవాజ్‌ కుమారుడు మాత్రం జైలులో నవాజ్‌పై విష ప్రయోగం జరిగినందువల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో జైలులో ఉన్న నవాజ్‌ కుమార్తె మరియమ్‌ తండ్రిని చూడాలని కోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో ఒక గంట పెరోల్‌పై ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి లభించింది. కాగా నవాజ్‌ను చూడటానికి వెళ్లిన ఆమె అస్వస్థతకు గురికావడంతో తనను కూడా అదే ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు... నవాజ్‌ షరీఫ్‌కు మెరుగైన వైద్యచికిత్సలు అందించవలసిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పంజాబ్‌ ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన సలహాదారు ఫిర్దోస్ ఆశిక్ అవన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు