5 లక్షల కిట్లు కొనుగోలు చేసిన మేరీల్యాండ్‌!

21 Apr, 2020 11:07 IST|Sakshi

దక్షిణ కొరియా నుంచి 5 లక్షల కిట్లు కొనుగోలు చేసిన అమెరికా రాష్ట్రం

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాపై కరోనా(కోవిడ్‌-19) విలయతాండవం చేస్తున్న వేళ.. మహమ్మారి నివారణ చర్యల్లో భాగంగా మేరీల్యాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 5 లక్షల టెస్టు కిట్లను దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ ల్యారీ హోగన్‌ వెల్లడించారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం కరోనా కట్టడిలో గేమ్‌ ఛేంజర్‌గా పనిచేస్తుందన్నారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... దాదాపు 9 మిలియన్‌ డాలర్ల వ్యయంతో ఐదు లక్షల కిట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ‘‘అనారోగ్యంతో ఉన్న వారిని.. వైరస్‌ సో​కిన వారిని గుర్తించడంలో టెస్టింగ్‌ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి కరోనా లక్షణలు ఉన్న వారిని ఐసోలేట్‌ చేసి చికిత్స అందిస్తూ వ్యాప్తిని అరికట్టవచ్చు. ముందు జాగ్రత్త చర్యల్లో ఇది ప్రముఖమైనది’’ అని పేర్కొన్నారు. (వైరస్‌ పుట్టుక గురించి చెప్పండి: జర్మనీ)

ఇక దక్షిణ కొరియాలోని ల్యాబ్‌జెనోమిక్స్‌ నుంచి టెస్టు కిట్లను కొరియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ద్వారా శనివారం బాల్టిమోర్‌ వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్టులో రిసీవ్‌ చేసుకున్నామని హోగన్‌ వెల్లడించారు. కిట్ల ధరల నిర్ణయం విషయంలో దక్షిణ కొరియా మూలాలున్న తన భార్య యుమీ కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. కాగా ఇప్పటి వరకు మేరీల్యాండ్‌లో 71,400 కరోనా పరీక్షలు నిర్వహించామన్న హోగన్‌... సరిపడా కిట్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామన్నారు. (ఆ దేశాల కంటే మేమే ముందున్నాం: ట్రంప్‌)

అదే విధంగా అమెరికాలో టెస్టింగ్‌ కిట్ల కొరత ఉందంటూ ఈ రిపబ్లికన్‌ ట్రంప్‌ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక హోగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్‌... ‘‘మేరీల్యాండ్‌ గవర్నర్‌ లాంటి వాళ్లకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఎన్నటికీ అర్థం కాదు’’అంటూ సొంత పార్టీ నేతపై విరుచుకుపడ్డారు. కాగా దాదాపు 60 లక్షల జనాభా ఉన్న మేరీల్యాండ్‌లో  కరోనాతో ఇప్పటివరకు 516 మంది మరణించగా... 13,684 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు