వారానికో మాత్రతో హెచ్‌ఐవీని జయించొచ్చు!

10 Jan, 2018 22:29 IST|Sakshi

బోస్టన్‌: హెచ్‌ఐవీ... పవర్‌ఫుల్‌ మందులకు కూడా లొంగని మొండి వైరస్‌. దీనిబారిన పడినవారి ఎయిడ్స్‌ సోకడం, క్రమక్రమంగా వారు మరణానికి దగ్గర కావడం వంటి ఎన్నో కేసులను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇకపై హెచ్‌ఐవీ బాధితులు ధైర్యంగా బతకొచ్చు. వేల రూపాయలు ఖర్చుచేసే మందులను వేసుకొని కాదు... కేవలం వారానికో మాత్ర చాలట. అమెరికాలోని మాసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ మాత్రను తయారుచేశారు. హెచ్‌ఐవీని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తినంతా ఓ మాత్రలో నింపారట.

వారానికో మాత్ర వేసుకుంటే చాలు... హెచ్‌ఐవీ కారణంగా ఎదురయ్యే సమస్యలన్నింటినీ అధిగమించవచ్చని చెబుతున్నారు. ఒక్కసారి మాత్ర వేసుకున్నా.. అది వారం రోజులపాటు మెల్లమెల్లగా మందును శరీరంలోకి విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఇది రోగి శారీరక ఆరోగ్యాన్నేకాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. తరచూ మందులు వేసుకోవడం వల్ల వైరస్‌ వాటిని తట్టుకునే శక్తిని సమకూర్చుకుంటుందని, ఇలా వారానికోసారి వేసుకునే మందు వల్ల వైరస్‌పై అది సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు