మెక్సికోను కుదిపేసిన భూకంపం

9 Sep, 2017 02:18 IST|Sakshi
భూకంప ధాటికి ఒక్సాకాలో ధ్వంసమైన భవనం

32 మంది మృతి; రిక్టర్‌ స్కేల్‌పై 8.1గా తీవ్రత
► పసిఫిక్‌ మహా సముద్రంలో భూకంప కేంద్రం
► సునామీ హెచ్చరికలు జారీ


మెక్సికో సిటీ: మెక్సికో దేశాన్ని శుక్రవారం ఉదయం అత్యంత శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో రిక్టర్‌ స్కేల్‌పై 8.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి మెక్సికో తీర ప్రాంత రాష్ట్రాల్లో 32 మంది మరణించారు. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. పసిఫిక్‌ మహాసముద్రంలో 69.7 కి.మీ లోతున భూకంపం సంభవించగా.. ముందు జాగ్రత్తగా ఉత్తర అమెరికా ఖండంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.  

మెక్సికో చియాపాస్‌ రాష్ట్రంలోని తపాచులాకు 165 కి.మీ. దూరంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో(భారత కాలమానం ప్రకారం) పసిఫిక్‌ సముద్రంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కి.మీ. దూరంలో ఉన్న మెక్సికో నగరంలో కూడా భవనాలు కంపించాయి. భూకంప తీవ్రతను 8.2 గా మెక్సికో ప్రభుత్వం పేర్కొనగా.. అమెరికా భూభౌతిక విభాగం మాత్రం తీవ్రత 8.1గా నమోదైందని వెల్లడించింది. 

ఒయక్సకా రాష్ట్రంలో మొత్తం 23 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్‌ అలెజాండ్రో మురాత్‌ చెప్పారు. ఒక్క జుచితాన్‌ పట్టణంలోనే 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రతకు జుచితాన్‌ పట్టణం ఎక్కువగా నష్టపోయింది. చియాపాస్‌ రాష్ట్రంలో ముగ్గురు, టబాస్కో రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారని, సహాయక కార్యక్రమాలు పూర్తయితే కానీ పూర్తి వివరాలు అందుబాటులోకి రావని అధికారులు వెల్లడించారు. మెక్సికో నగరం సహా 11 రాష్ట్రాల్లోని స్కూళ్లను మూసివేయాలని, నిర్మాణాల్ని తనిఖీ చేశాకే తెరవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  

మీటరు ఎత్తుతో అలలు
మెక్సికో తీరంలో ఒక మీటరు ఎత్తుతో అలలు ఎగసిపడ్డాయని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈక్వెడార్, ఎల్‌సాల్వడార్, గ్వాటెమాలా తీర ప్రాంతాల్లోను మీటరు, అంతకంటే తక్కువ ఎత్తులో అలలు ఎగసిపడ్డాయని వెల్లడించింది. హవాయి దీవులకు, పశ్చిమ, దక్షిణ పసిఫిక్‌ తీర ప్రాంతాలకు ఎలాంటి ముప్పులేదని పేర్కొంది.   

5 కోట్ల మందిపై ప్రభావం
‘గత వందేళ్లలో ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపం ఇదే’ అని మెక్సికో అధ్యక్షుడు  నియోటో అన్నారు. భూకంపం అనంతరం జాతీయ విపత్తు నివారణ కేంద్రంలో స్వయంగా ఆయన సహాయ కార్యక్రమాల్ని పర్యవేక్షించారు. మెక్సికోలో 5 కోట్ల మంది పై ప్రభావం ఉంది.  భూకంపం అనంతరం 4 అంతకుమించిన తీవ్రతతో 20 సార్లు ప్రకంపనలు వచ్చాయని అమెరికా భూభౌతిక విభాగం తెలిపింది. మెక్సికో సరిహద్దు దేశం గ్వాటెమాలా దేశంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 1985లో వచ్చిన భూకంపం ధాటికి మెక్సికోలో 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు