ఇటలీలో భారీ భూకంపం

25 Aug, 2016 07:41 IST|Sakshi
ఇటలీలో భారీ భూకంపం

- 120 మంది మృతి  రిక్టర్‌స్కేలుపై 6.2 తీవ్రత  
- మయన్మార్‌లోనూ ప్రకంపనలు
 
 అక్యుమోలి: ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.0 నుంచి 6.2 తీవ్రతతో దేశంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు తలెత్తాయి. ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. 368 మందికిపైగా గాయాలయ్యాయి. పలువురు శిథిలాల్లో చిక్కుకోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఆ తర్వాత ఆ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదేనని అధికారులు చెబుతున్నారు.  భూకంపం ధాటికి ఎమాట్రిస్ నగరం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు.  భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్‌జీఎస్ పేజర్ సిస్టమ్ ఇటలీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాన మంత్రి మాటో రెంజి ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా కూలిపోయిన భవ నాల శిథిలాల కింద చిక్కుకున్న పలువురు సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇలికా గ్రామస్తుడు 69 ఏళ్ల గిడో బోర్డో మీడియాతో మాట్లాడుతూ ‘నేనిక్కడ లేను. భూకంపం రాగానే హుటాహుటిన ఇక్కడికి వచ్చాను. చూస్తే.. మా సోదరి, ఆమె భర్త శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారిని వెలికితీసేవారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎలాగోలా వారి పిల్లల్ని రక్షించుకోగలిగాం. వారిప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని వివరించారు. బాధితుల్లో తొమ్మిది నెలల పాప కూడా ఉంది. వారి తల్లిదండ్రులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఓ మామ్మ చేసిన తెలివైన పని వల్ల ఆమె మనవలిద్దరూ బతికి బయటపడ్డారు. ప్రకంపనలు ప్రారంభం కాగానే ఆ మామ్మ ఆ పిల్లల్ని మంచం కిందకి విసిరేయడంతో వారికేం కాలేదు.

 మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం
 ఇటలీలో భూకంపంతో పెద్ద ఎత్తున ప్రజలు మృతిచెందడంపై భారత ప్రధాన మంతి నరేంద్ర మోదీ విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ఇటలీలో నివసించే భారతీయులకు ఎలాంటి ప్రమాదం జరగలేద ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

 మయన్మార్‌లో 6.8 తీవ్రతతో..
 మయన్మార్‌నూ భారీ భూకంపం కుదిపేసింది. సెంట్రల్ మయన్మార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సుమారు 84 కిలోమీటర్ల వరకు వ్యాపించిన ప్రకంపనాలు పొరుగున ఉన్న థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలలో ప్రభావం చూపాయి. భూకంపం ధాటికి 22 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ స్పానిష్ పర్యాటకుడు గాయపడ్డాడు. పలు భవనాలు, ప్రాచీన ఆలయాలు, పురాతన నగరం బగాన్‌లో 60 ప్రసిద్ధ పగోడాలు కుప్పకూలాయి. జనం భయంతో బయటికి పరుగులు తీశారు.

మరిన్ని వార్తలు