అమెరికాలో ముగ్గురు నల్లగొండ వాసుల దుర్మరణం!

26 Dec, 2018 12:53 IST|Sakshi
అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అక్కా, చెల్లి, తమ్ముడు

కొలిర్‌విల్లి: అమెరికాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు నల్గొండవాసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కొలిర్‌విల్‌లో మంగళవారం క్రిస్మస్‌ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇంట్లో మంటలు చేలరేగి ఈ దారుణం జరిగింది. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం ఆరుగురున్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన నలుగురు సజీవ దహనమయ్యారు. చనిపోయిన ముగ్గురు నల్గొండవాసులైన సాత్విక నాయక్‌, జయసుచిత్‌ నాయక్‌, సుహాస్ నాయక్‌గా గుర్తించారు. వీరు నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం గుర్రపు తండా వాసులు.  పైచదువుల కోసం ముగ్గురు అన్నాచెల్లెళ్లూ అమెరికాలోని కొలిర్‌విల్లిలో ఉంటున్నారు. నాయక్ కుటుంబం నల్గొండలో మిషనరీస్‌ తరపున పనిచేస్తోంది. ఉన్నత చదువుల కోసం అగ్ర రాజ్యానికి వెళ్లిన తమ పిల్లలు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలియడంతో గుర్రపు తండాలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. 

పండుగ వేడుకల్లో.. అనుకోని విషాదం!
క్రిస్మస్‌ పండుగ సందర్భంగా స్థానిక చర్చి పెద్ద డేనీ ఇంట్లో జరిగిన వేడుకల్లో సాత్విక్ నాయక్‌, సుహాస్ నాయక్‌, జయసుచిత్‌ పాల్గొన్నారు. డేనీ కుటుంబసభ్యులతో కలిసి మొత్తం ఆరుగురు క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, అర్ధరాత్రి సమయంలో షార్ట్‌  సర్కూట్‌థో ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అగ్నికీలలు ఒక్కసారిగా ఇంటిని చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో సాత్విక, జయసుచిత్‌, సుహాస్‌తోపాటు డేనీ భార్య మంటల్లో సజీవ దహనమయ్యారు. డేనీ, అతని కొడుకు మాత్రం అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. 


మరిన్ని వార్తలు