దూసుకొస్తున్న మహా ప్రళయం..!

19 Feb, 2018 11:17 IST|Sakshi
తైవాన్‌లో భూకంప ధాటికి ఒరిగిన భవనం, ఫిలిప్పీన్స్‌లో బద్దలైన అగ్ని పర్వతం

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ తీరంలో వరుస భూ ప్రకంపనలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. పసిఫిక్‌ మహా సముద్ర తీర ప్రాంతంలో ఆవరించిన ఉన్న ‘రింగ్‌ ఆఫ్‌​ఫైర్‌ జోన్‌’లో కదలిక వల్ల జపాన్‌, గ్వామ్‌, తైవాన్‌, అలస్కా, ఫిలిప్పీన్స్‌లో భూ కంపాలు విలయతాండవం సృష్టించాయి. అన్నిటి కన్నా తైవాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని కలిగించింది. అతి త్వరలో భారీ భూకంపాలు మరోసారి పసిఫిక్‌ తీర ప్రాంత దేశాలపై విరుచుకుపడబోతున్నాయని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తైవాన్‌లో సంభవించిన భూ కంప తీవ్రత రిక్టర్‌ స్కేలు మీద 6.4గా నమోదు కాగా, గ్వామ్‌లో 5.7, 5.6, 5.4, 4.9 తీవ్రతలతో పలుమార్లు భూమి కంపించింది. ఫిబ్రవరి 11 నుంచి ఇప్పటివరకూ జపాన్‌ తీర ప్రాంతంలో మూడు సార్లు భూమి తన ప్రకోపాన్ని ప్రదర్శించింది. ఆదివారం కూడా 4.8 తీవ్రతతో తైవాన్‌లో తీర​ప్రాంతంలో భూమి కంపించింది. ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఎప్పటినుంచో గాఢ నిద్రలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ నేపథ్యంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో మొదలైన కదలికలు మానవాళిని అతలాకుతలం చేస్తాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా.. మరికొందరు మాత్రం దాన్ని కొట్టిపారేస్తున్నారు.

రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో వస్తున్న కదలికలు సాధారణమైనవేనని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న భూకంపాల్లో 90 శాతం రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ఆవరించిన ప్రాంతంలోనే వస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అగ్ని పర్వతాల్లో నాలుగింట మూడో వంతు రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలోనే ఉన్నాయి.

భూమి ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ అంటే ఏంటి? 
రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ అనేది గుర్రపు నాడ ఆకృతిలో ఉంటే ఓ డిజాస్టర్‌ జోన్‌. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ బెల్ట్‌ ప్రాంతంలో 450కి పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. టెక్టోనిక్‌ ప్లేట్స్‌ తరచూ కదులుతూ ఈ అగ్నిపర్వతాల విస్ఫోటనానికి కారణం అవుతుంటాయి. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ బెల్ట్‌ భూమి క్రెస్ట్‌కు కనెక్ట్‌ అయి ఉండటం వల్ల భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు జరిగే నష్ట తీవ్రత ఊహించలేనంతగా ఉంటుంది.

న్యూజిలాండ్‌ ద్వీపం నుంచి ఆసియా, అమెరికా తీర ప్రాంతాలను తాకుతూ దక్షిణ అమెరికాలోని చిలీ వరకూ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ విస్తరించి ఉంది. అంటే 40 వేల కిలోమీటర్ల దూరం పాటు భారీ భూకంప వలయం భూమిపై ఉందన్నమాట. రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో కొన్ని చోట్ల సబ్‌డక్షన్‌ జోన్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో టెక్టోనిక్‌ ప్లేట్లు ఒకదానిపై మరొకటి అమర్చి ఉన్నాయి. ఈ కారణంగానే సముద్ర గర్భంలో భూ కంపాలు సంభవించినప్పుడు భారీ సునామీలు మానవాళిపై విరుచుకుపడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు