'బ్యూటిఫుల్ మైండ్' దుర్మరణం

24 May, 2015 21:13 IST|Sakshi
జాన్ నాష్ (ఎడమ), 'ఎ బ్యూటిఫుల్ మైండ్' చిత్రంలో నాష్ పాత్రలో హాలీవుడ్ హీరో మార్టిన్ క్రో

ఆర్థిక శాస్త్ర గమనంలో మేలి మలుపులాంటి గేమ్ థియరీని ప్రతిపాదించి,  అటుపై నోబెల్ సహా ఎన్నెన్నో అవార్డుల్ని సొంతం చేసుకున్న ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జాన్ నాష్ (87) ఆదివారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 

 

అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన ప్రయాణిస్తోన్న ట్యాక్సీ అదుపుతప్పి బోల్తా పడటంతో నాష్ సహా ఆయన భార్య ఆలిసియా (82) ఘటనా స్థలంలోనే మరణించినట్లు న్యూజెర్సీ పోలీసులు తెలిపారు. 2002లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును పొందిన 'ఎ బ్యూటిఫుల్ మైండ్' చిత్రం జాన్ నాష్ జీవితం ఆధారంగా నిర్మించిందే కావటం విశేషం.

1928, జూన్ 13న జన్మించిన నాష్.. 1958లో స్కిజోఫ్రీనియా రుగ్మతకు గురై ఆశ్చర్యకరమైన రీతిలో కోలుకుని మళ్లీ పూర్వపు మేధాశక్తిని సంపాదించాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం 'నాష్ సమతాస్థితి' గా ప్రసిద్ధి చెందింది. 1994లో మరో ఇద్దరు గేమ్ థియరీ ప్రతిపాదకులతో కలిసి ఉమ్మడిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు నాష్.

 

మరణానికి ముందు వరకు ప్రిన్స్టన్ యూనివర్సిటీలో బోధకుడిగా పనిచేశారు. జాన్ నాష్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. 'తన అసాధారణ ప్రతిభతో గణిత శాస్త్రానికి అద్భుత సేవలందించిన నాష్ కలకాలం గుర్తుండిపోతారు' అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన జీవితగాథ 'బ్యూటిఫుల్ మైండ్' లో లీడ్ రోల్ వేసిన హాలీవుడ్ హీరో రస్సెల్ క్రో.. జాన్ నాష్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'నా హృదయం కూడా వారితోనే వెళ్లిపోయింది' అని క్రో ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు