భారత్‌ మాపై దాడి చేయొచ్చు: పాక్‌

18 Aug, 2019 08:36 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఖురేషీ

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ సమస్య నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు భారత్‌ తమపై దాడిచేసే అవకాశముందని పాకిస్తాన్‌ ప్రకటించింది. భారత్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దీటుగా తిప్పికొడతామని హెచ్చరించింది. మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదన్న విధానానికి కట్టుబడి ఉన్నామనీ, అయితే భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ ఈ మేరకు స్పందించింది. పాక్‌ విదేశాంగ మంత్రి, ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్‌ గఫూర్‌ శనివారం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్‌ మాట్లాడుతూ..‘భారత్‌ ఎలాంటి దాడిచేసినా తిప్పికొట్టేందుకు ఎల్వోసీ వెంట పాక్‌ బలగాలను సిద్ధంగా ఉంచాం’అని తెలిపారు.

‘కశ్మీర్‌ సెల్‌’ ఏర్పాటు
అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ విమర్శించారు. ‘భారత్‌–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాజ్‌నాథ్‌ ఈ ప్రకటన చేయడం నిజంగా దురదృష్టకరం. భారత్‌ యుద్ధోన్మాదంతో ఉందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. పాక్‌ విదేశాంగ శాఖలో కశ్మీర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కశ్మీర్‌ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, సమాచారాన్ని చేరవేసేందుకు రాయబారుల్ని నియమిస్తాం’అని ఖురేషీ చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు