సెక్స్‌ వేధింపులపై ఇదో ‘ఫేస్‌బుక్‌’ ఉద్యమం

23 Aug, 2019 08:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మీటూ’ ఉద్యమంలాగా బ్రిటన్‌లో మరో ఉద్యమం మొదలయింది. అయితే ఇది ‘ఫేస్‌బుక్‌’ వేదికగా కొనసాగుతోంది. తమకు మాజీ జీవిత భాగస్వాముల నుంచి ఎదురైన చేదు అనుభవాలను మహిళలు వరుస క్రమంలో ఇందులో వివరిస్తున్నారు. వీటిలో ఎక్కువగా లైంగిక వేధింపులే ఉంటున్నాయి. మాజీ జీవిత భాగస్వాములైన పురుష పుంగవులు తమను ఎలా లైంగికంగా, మానసికంగా లోబర్చుకున్నారో, వేధించారో, రేప్‌లు చేశారో, తమను మోసం చేసి పరాయి స్త్రీలతో ఎలా కులికారో, తిరిగారో వివరిస్తూ  ‘ప్రిక్‌ అడ్వైజర్‌’ ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. మాజీ భాగస్వాముల పేర్లను, ఫొటోలను కూడా షేర్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రూపులో లక్ష మంది బ్రిటన్‌ మహిళలు చేరిపోయారు. 

‘క్లేర్స్‌ లా విషయంలో బ్రిటన్‌ అధికారులు చూపిస్తున్న అలసత్వం వల్లనే ఈ ఉద్యమం పుట్టుకొచ్చిందని ‘ప్రిక్‌ అడ్వైజర్‌ గ్రూప్‌’లోని ఒక అడ్వైజరయిన సమంతా రైట్‌ మీడియాకు వివరించారు. ‘క్లేర్స్‌ లా’ అనే చట్టం అప్పటి బ్రిటన్‌ హోం మంత్రి థెరిసా మే చొరవ మేరకు 2014, మార్చి నెల నుంచి అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు పెళ్లి చేసుకుని భార్యకు విడాకులు ఇచ్చిన మగవాళ్ల గృహ హింసకు సంబంధించిన నేర చరిత్రను తెలుసుకోవాలంటే వారిని పెళ్లి చేసుకోబోతున్న మహిళలను ఈ చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు. ఈ మేరకు పోలీసులిచ్చే సమాచారాన్ని చూసి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న భర్తల విషయంలో ఓ నిర్ణయానికి రావచ్చు. 

బ్రిటన్‌లో ఏటా 13 లక్షల మంది మహిళలు భర్తల చేతుల్లో లైంగిక వేధింపులు, గృహ హింసకు గురై విడిపోతుంటే వారిలో 18 శాతం మంది బాధితులే పోలీసు అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వారి భర్తలకు సంబంధించిన నేర చరిత్ర మాత్రమే పోలీసుల వద్ద నిక్షిప్తమై ఉంటోంది. మిగతా వారి గురించి తెలియడం లేదు. అందుకనే ఈ ‘ప్రిక్‌ అడ్వైజర్‌’ గ్రూప్‌ పేజీ పుట్టుకొచ్చింది. ఈ గ్రూపులో చేరిన మహిళలంతా మాజీ భర్తల నుంచి ఎదురైన అనుభవాలను వారి భార్యల పోస్టింగ్‌ల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. వాటిలో తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పురుష పుంగవులు ఎవరైనా ఉంటే వారి జాతకాలు చేతికి చిక్కినట్లే. 

ఈ ఫేస్‌బుక్‌ గ్రూప్‌పై మాజీ భర్తలు మాత్రం లబోదిబోమని గొడవ చేస్తున్నారు. ఈ పేరిట అమాయకులైన మగవారి జీవితాలను బలిచేసే ప్రమాదం ఉందని, పోస్టింగ్‌ల ఆధారంగా మాజీ భర్తలపై పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టి వేధించే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే....కలిసి కాపురం చేస్తున్నప్పుడు కాల్చుకుతిన్న భార్యలు భవిష్యత్తులో తాము మరో పెళ్లి చేసుకోకుండా ఇలా జీవితాలను నాశనంచేస్తున్నారని ఇంకొందరు వినిపిస్తుంటే, బతికితిమిరా దేవుడా ! అనుకుంటూ విడాకులు తీసుకుంటే ఈర్శాసూయలతోని, మానసిక రుగ్మలతోని మాజీ భార్యలు ఇలాగా కూడా వేధిస్తారా?....అంటూ గగ్గోలు పెడుతున్నవారూ లేకపోలేదు. అయితే ఏదీ తాము శ్రుతిమించనీయమని, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ‘ఫేస్‌బుక్‌’ యాజమాన్య వర్గాలు తెలియజేస్తున్నాయి. 

>
మరిన్ని వార్తలు