ఒంటరిగా నడవటం ఎందుకని...

11 Feb, 2018 13:42 IST|Sakshi
మేధా గుప్తా (ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : ఒంటరిగా నడవటం ఎందుకనుకుందోగానీ 16 ఏళ్ల ఆ అమ్మాయి చేసిన ప్రయత్నం వార్తల్లో నిలిచింది. సేఫ్‌ ట్రావెల్‌ పేరిట ఓ యాప్‌ను రూపకల్పన చేసి యాప్‌ ఛాలెంజ్‌కు పంపింది. ‘సమస్య ఉందని నాకు తెలుసు. అందుకే పరిష్కారాన్ని కూడా నేనే కనుగొన్న’ అని ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను విపరీతంగా ఆకట్టుకుంది.

వర్జినియాలోని హెర్న్‌డోన్‌కు చెందిన మేధా గుప్తా, థామస్‌ జెఫ్ఫర్‌ సన్‌ హైస్కూల్‌లో చదువుతోంది. రోజు తన స్కూల్‌ బస్సు పాయింట్‌ నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చేది. 20 నిమిషాల నడక ఆమెకు పెద్ద కష్టంగా అనిపించేది కాదు. అయితే శీతాకాలంలో త్వరగా చీకటి పడుతుండటంతో ఆమెకు భయంగా అనిపించేది. పైగా ఆ ప్రాంతంలో ఆకతాయిల వేధింపులు చాలా ఎక్కువ. దీంతో ఆమె తల్లి దగ్గర వాపోయింది. 

వెంటనే ఆ యువతి తల్లి దివ్య గుప్తా ఓ యాప్‌ తయారు చేయమని చెప్పింది. తల్లి అనుకోకుండా అన్న ఆ మాటలను మేధ సీరియస్‌గా తీసుకుంది. ఒంటరిగా వెళ్లే ప్రయాణికుల కోసం ఓ యాప్‌ను రూపకల్పన చేసింది. సేఫ్‌ ట్రావెల్‌ అని దానికి నామకరణం చేసింది. తొలి ప్రయత్నంలో అది అంతగా విజయం సాధించలేకపోయినా.. తర్వాత మాత్రం అది పని చేయటం ప్రారంభించింది. అది గమనించిన తండ్రి మన్మోహన్‌ గుప్తా.. ‘కాంగ్రెస్సియోనల్‌ యాప్‌ ఛాలెంజ్‌’కు ఎంట్రీగా ‘సేఫ్‌ ట్రావెల్‌’ను పంపాడు. 

పోటీలో మొత్తం  4100 స్టూడెంట్లు.. 1300 యాప్‌లను పంపించారు. ప్రతీ డిస్ట్రిక్‌ నుంచి ఒ‍క్కో విజేతను నిర్వాహకులు ఎంపిక చేస్తారు. వర్జినీయా నుంచి 200 మందికి పైగానే పోటీ పడ్డారు. చివరకు మేధా గుప్తా యాప్‌కు అవార్డు దక్కింది. యాప్‌ రూపకల్పన కోసం మేధా వాడిన సాంకేతికత, ఆమె చెప్పిన సమాధానాలు ఆకట్టుకున్నాయని న్యాయనిర్ణేత ముర్ఫే ప్రకటించారు. ప్రస్తుతం ఈ యాప్‌ ఫ్రీ డౌన్‌లోడ్‌కు అందుబాటులో లేదు. కానీ, భవిష్యత్తులో మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తానని మేధా చెబుతోంది. ‘మనం ఏదైనా పని చేయాలంటే దానికి అడ్డు మనమే. అందుకే దేన్ని పట్టించుకోకుండా ముందుకు సాగాలి’ అని మేధా చెబుతోంది.

>
మరిన్ని వార్తలు