ట్రంప్‌ ప్రసంగం: పాక్‌ మీడియా వక్రబుద్ధి!

25 Feb, 2020 15:14 IST|Sakshi

పాకిస్తాన్‌ మళ్లీ తన వక్రబుద్ధిని చూపించింది. ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌లోని కొన్ని ఇంగ్లీష్‌ వార్తా పత్రికలు ట్రంప్‌ పాకిస్తాన్‌ను ప్రశంసించినట్లు శీర్షికలు పెట్టాయి. భారత్‌లో పాకిస్తాన్‌ను పొగిడిన ట్రంప్‌ అని కథనాలు వెలువరించాయి. పాకిస్తాన్‌తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని, పాక్‌తో దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరచుకోవాలని ఆశిస్తున్నట్లు.. ట్రంప్‌ పేర్కొన్నారని స్థానిక పత్రికలు వార్తను ప్రచురించాయి. 

దీనికి సంబంధించి ప్రముఖ పాకిస్తాన్‌ పత్రిక కింది విధంగా కథనాన్ని ప్రచురించింది. ‘ఇండియాలో పాకిస్తాన్‌ను ప్రశంసించిన ట్రంప్‌’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించిన ఆ పత్రిక  దాంతో పాటు  సోమవారం భారత్‌ చేరుకున్న ట్రంప్‌ భారత లౌకితత్వాన్ని అభినందించారని పేర్కొంది.  ‘మాకు పాకిస్తాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి, అవి మరింత మెరుగుపడాలని కోరుకుంటున్నాం’ అని ట్రంప్‌ ప్రసంగించినట్లు ప్రచురించింది. కాగా సోమవారం అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్ మొతెరా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలసి ప్రసంగించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్‌, అమెరికా రెండు సరిహద్దుల్లో ఉగ్రవాదుల  బెడదను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని అరికట్టడానికి ఉమ్మడిగా ముందుకు సాగుతున్నామన్నారు. అమెరికా దృష్టిలో ఇండియాకు ప్రత్యేక స్థానం ఉందన్న ట్రంప్‌.. దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అయితే పాక్‌ మీడియా మాత్రం... ట్రంప్‌ ప్రసంగంలో పాక్‌ పేరును ప్రస్తావించడాన్ని హైలెట్‌ చేసి కథనాలు వెలువరించడం గమనార్హం. అయితే పాకిస్తాన్‌, పాకిస్తాని పదాలకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ట్రంప్‌ ప్రసంగంలో చోటు దక్కింది. కాగా అహ్మదాబాద్‌లో ప్రసంగం అనంతరం ట్రంప్‌... ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఇక మొతెరా స్టేడియంలో లక్షమందితో నమస్తే ట్రంప్‌ కార్యక్రమాన్ని నిర్వహంచిన సంగతి తెలిసిందే. (చదవండి: ట్రంప్‌ నోట పాకిస్తాన్‌.. జస్ట్‌ నాలుగుసార్లే!)

>
మరిన్ని వార్తలు