మంచి నిద్ర కావాలా..!

17 Feb, 2015 15:03 IST|Sakshi
మంచి నిద్ర కావాలా..!

మెళకువ రాని, ఆందోళన లేని నిద్ర కావాలా..! అయితే మీరు రోజూ యోగా చేసేవారైతే ఆ యోగం పడుతుందంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. నిద్రపట్టక బాధపడుతూ.. మాత్రలు వేసుకునే బదులు ప్రశాంతంగా యోగా చేస్తే చాలు, బ్రహ్మాండమైన నిద్ర వస్తుందని ఘంటాపథంగా చెబుతున్నారు.

ప్రశాంత స్థితిలో యోగా చేసి, బాగా నిద్రపోతే.. ఆ తర్వత తాము శారీరకంగా, మానసికంగా రోజూ ఏమేం పనులు చేస్తున్నామో, అందులో ఏవి ఆనందాన్నిస్తాయో తెలుసుకోవచ్చని అంటున్నారు. సాధారణంగా కాస్త వయసు మీరిన తర్వాత వచ్చే నిద్రలేమి దరిచేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లవుతుందని సదరు అధ్యయనం వెల్లడించింది.  

"మనసును నియంత్రించుకుని యోగా చేస్తే నిద్రలేమితో బాధపడే ఏ వయసు వాళ్లయినా ఉపశమనం కలగనుందని మేం చేసిన పరిశోధనలో తేలింది'' అని లాస్ ఏంజిల్స్లోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన డేవిడ్ బ్లాక్ అన్నారు. ఇందుకోసం వారు సగటున 66 సంవత్సరాల వయసుగల 49 మందిపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించారు. పెద్దవారిలో నిద్ర సమస్యకు పేరుకుపోయిన కొవ్వులాంటి పదార్థాలు కారణమని కూడా ఈ పరిశోధనల్లో తెలిసింది.

మరిన్ని వార్తలు