రోనీ, డానీ @ 63

5 Jul, 2014 05:43 IST|Sakshi
రోనీ, డానీ @ 63

ఈ అవిభక్త కవలల పేర్లు రోనీ, డానీ. వయసు 62 సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు. ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అవిభక్త కవలల్లో వీరే పెద్ద. థాయ్ ట్విన్స్.. చాంగ్, ఎంగ్ బంకర్‌లు 62 ఏళ్ల ఎనిమిది నెలల ఆరు రోజులు జీవించారు. దీంతో వారిద్దరి వయసును రోనీ, డానీలు అధిగమించారు. మరో నాలుగు నెలల్లో ఇంకో అరుదైన రికార్డును కూడా  వీరు సొంతం చేసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన అవిభక్త కవలలుగా గిన్నిస్ పుస్తకంలోకి ఎక్కనున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డు.. 1877లో ఇటలీలో జన్మించిన గియాకోమో, గియోవాన్ని బట్టిస్టా టోక్కిల పేరిట ఉండేది. వారు 63 ఏళ్ల వయసులో 1940లో కన్నుమూశారు. అమెరికాలోని ఒహియోకు చెందిన రోనీ, డానీలు 1951 అక్టోబర్ 28న జన్మించారు.
 
 ఒకరికి ఎదురుగా మరొకరు ఉన్నట్టుగా అతుక్కుని పుట్టిన వీరిద్దరికీ నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు వేర్వేరు గుండెలు, ఉదరాలు ఉన్నాయి. అయితే జీర్ణకోశం, పురీషనాళం, పురుషాంగం మాత్రం ఒక్కోటే ఉంది. వీటిపై డానీకే నియంత్రణ ఉంటుంది. జన్మించినప్పుడు వీరిద్దరూ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, శస్త్రచికిత్స ద్వారా వేరు చేయడం కోసం డాక్టర్లు ఇద్దరినీ రెండేళ్లపాటు ఆస్పత్రిలోనే ఉంచారు. ఆపరేషన్ చేస్తే ఇద్దరూ బతుకుతారని గ్యారంటీ ఇవ్వలేమని చెప్పడంతో రోనీ, డానీల తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి ఇలా కలిసే పెరిగారు. నాలుగేళ్ల ప్రాయం నుంచే సంపాదనలో కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచారు. తమకంటే 11 ఏళ్లు చిన్నవాడైన సోదరుడు జిమ్‌తో కలిసి సర్కస్‌లో మేజిక్ ట్రిక్స్ ప్రదర్శిస్తుంటారు. 39 ఏళ్ల వయసులో 1991లో తమ ఉద్యోగాల నుంచి రిటైరయ్యారు. ప్రస్తుతం జిమ్, ఆయన భార్య హాల్వేస్ వీరి ఆలనాపాలనా చూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు