పాకిస్తాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరిక

22 Jun, 2019 09:52 IST|Sakshi

ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌  పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు

టెర్రర్ ఫైనాన్సింగ్‌పై  వైఖరి మార్చుకో  లేదంటే చర్యలు

అక్టోబర్‌ వరకే సమయం..లేదంటే బ్లాక్‌లిస్ట్‌

వాషింగ్టన్‌: టెర్రర్ ఫైనాన్సింగ్‌పై పాకిస్తాన్  తన వైఖరిని మార్చుకోవాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్‌ఏఎటిఎఫ్)  మరోసారి తీవ్ర  ఒత్తిడిని పెంచింది.  కార్యాచరణ ప్రణాళికను పూర్తి చేయడంలో పాక్‌ విఫలమైందని, అక్టోబర్‌ నాటికి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే అంశంపై తన వైఖరి మార్చుకోవాలని శుక్రవారం హెచ్చరించింది.  ఈ విషయంలో తన నిబద్ధతను పాటించకపోతే గట్టి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడింది.   ఇది  బ్లాక్‌లిస్ట్‌కు కూడా దారితీయవచ్చని హెచ్చరించింది.

ఫ్లోరిడాలోని ఓర్లాండ్లో ముగిసిన ప్లీనరీ సమావేశాల అనంతరం ఎఫ్‌ఏఎటిఎఫ్ ఈ ప్రకటనను విడుదల చేసింది. పాకిస్తాన్ తన కార్యాచరణ ప్రణాళికను జనవరి వరకు విధించిన గడువులోపు పూర్తి చేయడంలో విఫలమవ్వడమే కాక, మే 2019 నాటికి కూడా విఫలమైందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.  ఇకనైనా తమ వ్యూహాత్మక లోపాలను సరిదిద్దుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను కచ్చితంగా అమలు చేయాలని, 2019 అక్టోబర్ నాటికి దీన్ని వేగంగా పూర్తి చేయాలని వార్నింగ్‌ ఇచ్చింది. లేదంటే ఆ తరువాత ఏం చేయాలనేది  నిర్ణయం  తీసుకుంటామని తెగేసి  చెప్పింది.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను నిషేధిత జాబితాలో (బ్లాక్‌లిస్ట్) చేర్చాలని ఎఫ్‌ఏటీఎఫ్ పై భారత్ ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం గ్రే లిస్ట్‌లో ఉన్న పాకిస్థాన్ అక్టోబర్ వరకు ఇదే జాబితాలో కొనసాగనుంది. ఉగ్రవాదులకు అందే నిధులపైన ఎఫ్‌ఏటీఎఫ్ నిఘా పెట్టి, అందుకనుగుణంగా చర్యలు చేపడుతుంది. ఏ దేశమైనా నిధులు సమకూర్చుతున్నట్లు తేలితే బ్లాక్‌లిస్ట్‌లో పెడుతుంది.

మరిన్ని వార్తలు