బ్లడ్ క్యాన్సర్‌ను నయంచేసే అద్భుత మాత్ర

26 Aug, 2016 19:22 IST|Sakshi
బ్లడ్ క్యాన్సర్‌ను నయంచేసే అద్భుత మాత్ర

మెల్‌బోర్న్: అత్యంత ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ (లింఫోటిక్ లుకేమియా) నయం చేయడానికి అద్భుతమైన మాత్ర త్వరలోనే ప్రపంచ మార్కెట్‌లోకి రానుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో వున్న ‘వాల్టర్ అండ్ ఎలిజా హాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ సంస్థ ఈ అద్భుతమైన మాత్రను రూపొందించి దానికి వెనెటోక్లాక్స్ అని పేరు పెట్టింది. ఈ మాత్రను డోసేజ్ ప్రకారం వాడడం వల్ల క్యాన్సర్ కణాలు కరగిపోతాయి.

వాస్తవానికి ఈ మందును మెల్‌బోర్న్ సంస్థ 1980 దశకంలోనే కనిపెట్టింది. ముందుగా జంతువులపై ప్రయోగాలు జరిపి, అనంతరం క్యాన్సర్ రోగులపై కూడా ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించడానికి ఇంతకాలం పట్టింది. క్యాన్సర్ కణాలను ప్రోత్సహించే ‘బీసీఎల్ 2’ ప్రోటీన్‌ను నాశనం చేయడం త్వారా తమ డ్రగ్ క్యాన్సర్ కణాలను కరగిపోయేలా చేస్తుందని సంస్థకు చెందిన నిపుణులు తెలిపారు. ఎలాంటి మందులతో కూడా క్యాన్సర్ నయంకాని లింపోటిక్ లుకేమియాతో బాధపడుతున్న 116 మంది రోగులను తాము ఎంపికచేసుకొని వారికి వెనెటోక్లాక్స్ మాత్రలను రెండేళ్లపాటు ఇచ్చి చూశామని, దాదాపు 80 శాతం మందికి క్యాన్సర్ తగ్గిపోయిందని పరిశోధకులు వెల్లడించారు. వారిలో ఎక్కువ మందికి బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోగా కొంత మందిలో ఎక్కువ మందికి తగ్గిపోయిందని, వారందిరిలోనూ జీవితకాలం పెరిగిందని వారు వివరించారు.

 ‘నేను ఎన్నో మందులు వాడి చూశాను. దేనీకి నా క్యాన్సర్ జబ్బు నయం కాలేదు. రోజుకు 20 గంటలపాటు పడక మీదనే పడుకొని ఉండేవాడిని. ఏ పని చేయడానికి శక్తి ఉండేది కాదు. గత రెండేళ్లుగా వెనెటోక్లాక్స్ మాత్రలను వాడాను. ఇప్పుడు పూర్తిగా క్యాన్సర్ నయం అయింది. ఇప్పుడు నేను నా వయస్సుకు తగ్గ ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని మెల్‌బోర్న్ రాయల్ ఆస్పత్రిలో పూర్తిగా కోలుకున్న 68 ఏళ్ల విక్ బ్యాక్‌వుడ్ మీడియాతో చెప్పారు. ఈ డ్రగ్‌ను త్వరలో అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ మంగళవారం నాడు అనుమతి మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు