పురుషులు ఇంట్లో.. మహిళలు పనుల్లో

6 Sep, 2017 04:41 IST|Sakshi
పురుషులు ఇంట్లో.. మహిళలు పనుల్లో
బెర్లిన్‌: ఇప్పుడైతే పురుషులు, మహిళలు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు ఉద్యోగరీత్యా పురుషులే వలస జీవులుగా మారేవారు. అయితే ఇదంతా ఇప్పటి మాట. ఈ రెండింటిలా కాకుండా రాతియుగం చివర్లో, శిలాయుగం మొదట్లో మహిళలే ఇంటి బాధ్యతలు, సమాజ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ కాలంలో యూరప్‌లోని మహిళలు తాము ఉన్న ప్రాంతాల నుంచి వలస వెళ్లి కుటుంబాలను ఏర్పాటు చేయటం, సంస్కృతి, ఆలోచనలు, విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం వంటివి చేశారని శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే ఇదే సమయంలో పురుషులు మాత్రం ఇంటికే పరిమితమయ్యేవారని అధ్యయనంలో బయటపడింది. రాతియుగం చివరల్లో శిలా యుగం మొదట్లో జర్మనీలో ఆశ్చర్యకరంగా కుటుంబాల ఏర్పాటు జరిగిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సమయంలో పురుషులు తాము పుట్టిన ఊరులోనే ఉండగా.. మహిళల్లో ఎక్కువ శాతం మంది బొహేమియా, సెంట్రల్‌ జర్మనీ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిపారు. అయితే క్రీ.పూ.2500–1650 మధ్య కాలంలో ఇలా వలస వచ్చిన మహిళలను ఖననం చేసిన ప్రదేశంలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఇలా వలస వచ్చిన మహిళలు చనిపోయే నాటికి స్థానిక సమాజంలో కలిసిపోయారని వారు గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  
మరిన్ని వార్తలు