బుధుడి ఫొటో.. అతి సమీపం నుంచి!

30 Jul, 2014 03:18 IST|Sakshi
బుధుడి ఫొటో.. అతి సమీపం నుంచి!

సూర్యుడికి అతి సమీపంలో ఉన్న బుధగ్రహాన్ని నాసా ‘మెస్సెంజర్’ వ్యోమనౌక అతి సమీపం నుంచి తీసిన ఫొటో ఇది. ఈ వ్యోమనౌక తీసిన అన్ని ఫొటోల్లోనూ ఇదే అత్యంత స్పష్టమైనదట. చిత్రంలో కనిపిస్తున్నవి బుధగ్రహం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన చిన్నచిన్న బిలాలు(క్రేటర్లు). గతంలో ఈ గ్రహాన్ని ఖగోళ వస్తువులు ఢీకొట్టినప్పుడు పెద్దపెద్ద బిలాలు ఏర్పడ్డాయని, ఆ సందర్భంగా పదార్థం లేదా ఖగోళ వస్తువుల ముక్కలు పక్కకు ఎగిరిపడటం వల్లే పక్కన ఈ చిన్నచిన్న బిలాలు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీటిలో పెద్ద బిలాలు కొన్ని వందల మీటర్లు, చిన్నవి పదుల మీటర్ల వైశాల్యంతో ఉన్నాయట. శుక్రవారం బుధగ్రహానికి 100 కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లిన మెస్సెంజర్ ఈ చిత్రాన్ని తీసింది. ఈ ఫొటోను జూమ్‌చేసి 2 మీటర్ల బిలాలను కూడా స్పష్టంగా చూడొచ్చట. ఆగస్టు 19న ఇది బుధుడికి మరింత దగ్గరగా.. జస్ట్ 50 కిలోమీటర్ల సమీపంలోకే వెళ్లి ఫొటోలు తీయనుందట. 2004లో నింగికి ఎగిరి, 2011లో బుధుడి కక్ష్యను చేరిన ఈ వ్యోమనౌక వచ్చే ఏడాది మార్చివరకూ పనిచేయనుందట.‘మెస్సెంజర్’
 

మరిన్ని వార్తలు