మెక్సికో లేడీ డాన్‌ ఆఖరి క్షణాలు....

14 Jan, 2020 19:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇన్‌స్టాగ్రామ్‌’ సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మెక్సికో మాఫియా లేడీ డాన్‌ ‘లా కత్రినా’ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆమె అసలు పేరు మెరియా గ్వాడలూప్‌ లోపెజ్‌ ఎస్కివెల్‌. హత్యలు, కిడ్నాప్‌లతోపాటు మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ వ్యాపారం చేసే మాఫియా మూఠాకు ఆమె 2017లో నాయకురాలు అయ్యారు. తండ్రి నుంచి ఆమెకు ఆ నాయకత్వం దక్కిందని చెబుతారు. ఆమె గత అక్టోబర్‌ 14వ తేదీన పోలీసులపై దాడి చేయగా 13 మంది పోలీసులు మరణించారు. 9 మంది గాయపడ్డారు.

అప్పటి నుంచి మెక్సికో పోలీసులు ఆమె కోసం కాపు కాస్తున్నారు. ‘ఎం 2’గా వ్యవహరించే మరో ముఠా నాయకుడిని కలుసుకునేందుకు ఆమె గత శుక్రవారం తన బాడీ గార్డులతో లా బొకాండ నగరంలోని ఓ ఇంటికి నిరీక్షిస్తుండగా, పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ఇంటిపై మెరుపు దాడి జరిపి కాల్పులు జరపగా, ఆమె మెడలో బుల్లెట్‌ దిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె మరణించారు. పోలీసుల కాల్పుల్లో ఆమె ముఠాకు చెందిన మరో యువతి మరణించగా, ఏడుగురు గన్‌మేన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారీ ఎత్తున తుపాకులు, మందుగుండు సామాగ్రి దొరికాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సోమవారం మీడియాకు అందిన వీడియో ఫొటోలు, ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన లా కత్రినా ఆఖరి క్షణాలను వీడియోలో చూడవచ్చు. ఆమె ఏకే 47 తుపాకీ పట్టుకొని దిగిన ఫొటో అప్పట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం రేపింది,

మరిన్ని వార్తలు