ఆరో అంతస్తులో యోగా.. బ్యాలెన్స్‌ కోల్పోవడంతో

27 Aug, 2019 18:18 IST|Sakshi

మెక్సికో: యోగా లాంటివి నిపుణులు పర్యవేక్షణలో చేయాలంటారు. అలా కాదని సొంతంగా ప్రయత్నిస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఈ సంఘటన చదివితే అర్థం అవుతుంది. యోగాసనం సాధన చేస్తూ.. ఓ యువతి 80 అడుగులు ఎత్తులో ఉన్న తన ఇంటి బాల్కనీ నుంచి కింద పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వివరాలు.. మెక్సికోకు చెందిన అలెక్సా తెర్రాజా(23) అనే యువతి తన ఇంటి పిట్టగోడ మీద ఓ కఠినమైన యోగాసనాన్ని ప్రాక్టీస్‌ చేసేందుకు ప్రయత్నించింది. కానీ పట్టు తప్పడంతో అక్కడి నుంచి 80 అడుగులు కిందకు పడిపోయింది. ఆ సమయంలో అలెక్సా పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలు, తనను కాపాడేందుకు ప్రయత్నించకపోగో ఫోటో తీసి ఇంటర్నెట్‌లో షేర్‌ చేసింది. అలెక్సా కిందకు పడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
 

అలెక్సా కిందపడటం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆరో అంతస్తు నుంచి కిందపడటంతో అలెక్సా తీవ్రంగా గాయపడింది. ఆమె తలకు పెద్ద గాయం అయ్యింది. దాంతో వైద్యులు దాదాపు 11 గంటలు శ్రమించి అలెక్సాకు ఆపరేషన్‌ చేశారు. అనంతరం వైద్యులు అలెక్సా ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ‘ఆమె శరీరంలో దాదాపు 110 ఎముకలు విరిగాయి. ఆమె తల, కాళ్లు, చేతులు, నడుము భాగంలో చాలా గాయలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. కోలుకున్నా కూడా దాదాపు మూడేళ్ల పాటు ఆమె నడవలేకపోవచ్చు. కిందపడటంతో రక్త స్రావం కూడా ఎక్కువగానే జరిగింది. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు ఆన్‌లైన్లో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు’ అని తెలిపారు.
 

మరిన్ని వార్తలు