ఎలుకలు తినేశాయ్‌..

15 Apr, 2018 02:20 IST|Sakshi

స్మగ్లర్ల నుంచి పట్టుకున్న గంజాయిని పోలీసులు ఏం చేస్తారు.. ఏదైనా భద్రత ఉన్న ప్రాంతాల్లో దాచేస్తారు.. అలా గంజాయిని దాచిన అర్జెంటినా పోలీసులకు ఓ రోజు షాక్‌ తగిలింది. వారు పట్టుకుని దాచిపెట్టిన గంజాయిలో 540 కిలోగ్రాములు మాయమై పోయిందట. దీంతో ఉన్నతాధికారులు చాలా సీరియస్‌ అయ్యారట. దీంతో వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని ఆదేశించారట. దీంతో అక్కడి పోలీసులు ఏం చెప్పారో తెలుసా.. 540 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని..! అది కూడా ఆ ఎలుకలు గంజాయికి బానిసైపోయి తిన్నాయని చెప్పారు.

దీంతో అవాక్కయిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 2017 ఏప్రిల్‌లో పైలర్‌ అనే ఓ పట్టణంలోని జైలులో పర్యవేక్షణ అధికారి జేవియర్‌ స్పెసియా బదిలీ కావడంతో అక్కడి గంజాయి మాయమైపోయిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చాలా రోజుల పాటు దర్యాప్తు చేసిన అధికారులు అలాంటిదేం లేదని తేల్చేశారు. ఆ పర్యవేక్షణ అధికారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని చివరికి నివేదికలో తేల్చేశారు.

ఏదో ఎలుకల పేరు చెప్పి తప్పించుకుందామనుకుంటే ఆ అధికారికి అసలుకే ఎసరొచ్చింది. ‘రెండేళ్లుగా అక్కడ గంజాయిని నిల్వ చేసి ఉండటంతో బాగా ఎండిపోయి ఉంది. అయితే అంత మొత్తంలో ఎలుకలు గంజాయిని తిని ఉంటే అవి కచ్చితంగా బతికే అవకాశం లేదు. చనిపోయి ఉండాలి.. అంటే చనిపోయిన ఎలుకలు అక్కడే ఉండాలి. కానీ అవి ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు’ అని డాక్టర్లు తేల్చారు.  

మరిన్ని వార్తలు