చైనా కంటే ఆ దేశమే సమస్యాత్మకం..

20 Feb, 2020 13:56 IST|Sakshi

వాషింగ్టన్‌ : వాతావరణ మార్పులపై పోరాటం, కార్బన్‌ ఉద్గారాల నియంత్రణలో చైనా కంటే భారత్‌ అత్యంత సమస్యాత్మకమని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్ధి, న్యూయార్క్‌ మాజీ మేయర్‌ మైకేల్‌ బ్లూమ్‌బర్గ్‌ అన్నారు. లాస్‌వెగాస్‌లో డెమొక్రటిక్‌ ప్రెసిడెన్షియల్‌ తొలి డిబేట్‌లో పాల్గొన్న బ్లూమ్‌బర్గ్‌ 2015 ప్యారిస్‌ వాతావరణ మార్పుల ఒప్పందం నుంచి అమెరికాను దూరం చేయడం ట్రంప్‌ ప్రభుత్వ తప్పిదమని దుయ్యబట్టారు. ఇక వాతావరణ మార్పుల విషయానికి వస్తే చైనా ఈ విషయంలో కొంత వెనక్కితగ్గినా భారత్‌ అత్యంత సమస్యాత్మకంగా మారిందని దీనిపై ఏ ఒక్కరూ ఏమీ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

చైనాలో మీరు ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన క్రమంలో ఆ దేశం ప్రపంచంలోనే అ‍త్యధికంగా కార్బన్‌ ఉద్గారాలను విడుదల చేస్తున్న క్రమంలో చైనాను మీరు ఎలా నియంత్రిస్తారని ప్రశ్నించగా చైనాతో మనం యుద్ధానికి వెళ్లమని, వారితో మనం చర్చించి టారిఫ్‌లతో మనం ఎంత ఇబ్బందులు పడుతున్నామో వారిని ఒప్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై చైనా స్పందించని పక్షంలో వారి ప్రజలతో పాటు మన ప్రజలూ ప్రాణాలు కోల్పోతారని, దీనిపై మనమంతా కలిసి పనిచేయాల్సి ఉంటుందని బ్లూమ్‌బర్గ్‌ చెప్పుకొచ్చారు. వాతావరణ మార్పులపై అమెరికా భిన్నంగా స్పందిస్తోందని తాము బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లను మూసివేస్తున్నామని, ఇప్పటికే 304 ప్లాంట్లు మూతపడగా, యూరప్‌లో 80 కాలుష్యకారక ప్లాంట్లు మూతపడ్డాయని చెప్పారు.

చదవండి : ఆ బిలియనీర్‌ బ్లూమ్‌బర్గ్‌ను అమ్మేస్తాడు..

మరిన్ని వార్తలు