ఉగ్రవాదంపై పాక్‌ చర్యలు తీసుకోవాల్సిందే

12 Mar, 2019 04:33 IST|Sakshi

వాషింగ్టన్‌: ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్‌ ప్రణాళికా బద్ధంగా, ప్రపంచదేశాలతో కలసి చర్యలు తీసుకోవాలని భారత్, అమెరికాలు పునరుద్ఘాటించాయి. పాక్‌ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలని, వారికి ఎలాంటి సాయం చేయకుండా ఉండాలన్నాయి. ఏ రూపంలోనైనా ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారు దానికి తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుందని తేల్చిచెప్పాయి. ఆదివారం అమెరికా చేరుకున్న భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే సోమవారం ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియోతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో విదేశీ విధానం, భద్రతాపర అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై పాంపియో, గోఖలే సంతృప్తి వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పుల్వామా దాడి అనంతరం భారత్‌కు మద్దతు ఇవ్వడంపై అమెరికా ప్రభుత్వానికి గోఖలే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొంది. ఉగ్రవాదం విషయంలో భారత్‌ ఆందోళనను తాము అర్థం చేసుకుంటానని పాంపియో వెల్లడించారని తెలిపింది. అమెరికాలోని ఇతర ప్రభుత్వ అధికారులతో కూడా గోఖలే భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు