‘అందుకే మ్యారేజ్‌ కౌన్సిలింగ్‌ కావాలని కోరాను’

13 Nov, 2018 15:42 IST|Sakshi

వాషింగ్టన్‌ : ‘కొన్ని కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరిగే అవకాశం ఉండదు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు’ అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా తాను మ్యారేజ్‌ కౌన్సిలింగ్‌కు వెళ్లిన నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. పీపుల్‌ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... ‘మేము రోల్‌ మోడల్స్‌ కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అనుసరించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతీ విషయంలో నిజాయితీగా ఉండాలని కోరుకుంటాం. కొన్నిసార్లు వివాహ బంధం నుంచి వైదొలగాలని అన్పిస్తుంది. ఎవరికైనా ఇది సహజం. నాకు కూడా చాలాసార్లు అలాగే అన్పించింది. అందుకే మ్యారేజ్‌ కౌన్సిలింగ్‌ కావాలని కోరానని మిచెల్‌ పేర్కొన్నారు. కౌన్సిలింగ్‌ జరిగిన నాటి నుంచి తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టామని, అందుకే చాలా విషయాల్లో తాను చేసే చిన్న చిన్న తప్పులేంటో తెలిసొచ్చాయని మిచెల్‌ చెప్పుకొచ్చారు. అంతేకాదు అప్పటి నుంచే తన భర్తతో పాటుగా ఇతరులను కూడా సహాయం అడిగే చొరవ లభించిందని పేర్కొన్నారు. 

మ్యారేజ్‌ కౌన్సిలింగ్‌కు వెళ్లడం వల్ల దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోయి, ఆ బంధం మరింత బలపడుతుంది. కాబట్టి కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సి వస్తే ఏమాత్రం ఇబ్బంది పడవద్దని మిచెల్‌ సూచించారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా‌- మిచెల్‌ల వివాహం 1992లో జరిగింది. వీరికి మాలియా, సాషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు