మిచిగాన్‌ను ముంచెత్తిన వరద: అత్యవసర పరిస్థితి

20 May, 2020 19:29 IST|Sakshi

జలదిగ్బంధంలో మిచిగాన్‌

తెగిన ఆనకట్టలు

10 వేలమంది తరలింపు

అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్

వాషింగ్టన్‌: ఇప్పటికే కరోనా వైరస్‌ సంక్షోభంతో విలవిల్లాడుతున్న అమెరికాలోని  మిచిగాన్‌  మరో  తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మిచిగాన్‌ను అసాధారణమైన వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఈడెన్‌విల్లే, శాన్‌ఫోర్డ్  ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

వేగంగా పెరుగుతున్న నీరు ఆనకట్టలను ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాలన్నీ జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి.  ఈడెన్‌ విల్లే,  శాన్‌ఫోర్డ్,  మిడ్‌ ల్యాండ్‌ నగరాలను ఖాళీ చేయించారు.  సుమారు 10,000 మందిని సురక్షిత ప్రారంతాలకు తరలించారు.  అటు నేషనల్ వెదర్ సర్వీస్  కూడా  దీన్ని ‘ప్రాణాంతక పరిస్థితి’ గా  పేర్కొంది.

రాబోయే 12 నుండి 15 గంటలలో, మిడ్‌లాండ్‌ దిగువప్రాంతం సుమారు 9 అడుగుల లోతు నీటిలో చిక్కుకోవచ్చని మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ మంగళవారం చెప్పారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎపుడూ చూడలేదనీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని ప్రజలను ఆమె కోరారు. అటు మిడ్‌ల్యాండ్ ప్రధాన కార్యాలయం ఖాళీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి అవసరమైన సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు.  మరోవైపు 500 సంవత్సరాల తరువాత 1986లో ఏర్పడిన వరద పరిస్థితి రానుందని,  టిట్టాబావాస్సీ నది నీటి మట్టం  38 అడుగుల  రికార్డు ఎత్తుకు పెరగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు