కరోనాపై ముందే హెచ్చరించిన బిల్‌ గేట్స్‌!

21 Mar, 2020 16:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ లాంటి మహమ్మారి ప్రపంచ మానవాళిపై దాడి చేస్తుందని, ఫలితంగా ఎంతో మంది మృత్యువాత పడతారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ‘మైక్రోసాఫ్ట్‌’ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ 2015లోనే అంచనా వేయడం, ఆ విషయాన్ని ఆయన ప్రజాముఖంగా ‘టెడ్‌ టాక్‌’లో తెలియజేయడం విశేషం. ‘అణు యుద్ధానికి ధనిక దేశాలు ఎలాగైతే సన్నద్ధం అవుతాయో, అలా సన్నద్దమయితేనే రానున్ను మహమ్మారిని ఎదుర్కోగలం. రానున్న దశాబ్దాల్లో లక్షలాది మంది ప్రజలు యుద్ధాల బారిన కాకుండా వైరస్‌ల బారిన పడి చనిపోతారు. ఎబోలా వైరస్‌ లాంటివి ఇప్పటికే దాడి చేసినా ప్రభుత్వాలు ఇప్పటికీ కళ్లు తెరవలేకపోతున్నాయి. ఫలితంగా ముప్పు తీవ్రమవుతోంది. మళ్లీ చెబుతున్నా దాడి చేసేవి మిస్సైల్స్‌ కావు, మైక్రోబ్స్‌’ అని బిల్‌ గేట్స్‌ హెచ్చరించారు.

సార్స్, మెర్స్, ఎబోలా లాంటి వైరస్‌ల దాడులను చూసినప్పటికీ ప్రపంచ దేశాలు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోవడంతో బిల్‌ గేట్స్‌ ఊహించినట్లు నేడు అవి కరోనా మహమ్మారి బారిన పడ్డాయి. ఎబోలా వైరస్‌ కారణంగా 2013 నుంచి 2016 మధ్య కాలంలో గినియా, లైబీరియా, సియెర్రా లియేన్‌ పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో 11 వేల మంది మరణించారు. ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా మరణించగా, రెండున్నర లక్షల మంది వ్యాధిగ్రస్థులయ్యారు.

‘ఎబోలా పట్టణ ప్రాంతాలకు విస్తరించక పోవడం కేవలం మన అదృష్టం. మరోసారి వైరస్‌ మహమ్మారి దాడి చేస్తే మనకు అదృష్టం కలసి రాకపోవచ్చు. సైనిక ముప్పులను ఎంత తీవ్రంగా తీసుకుంటారో, అంతే తీవ్రంగా వైరస్‌ దాడులను పరిగణించాలి. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని యుద్ధాలకు సన్నద్దం అవడం కోసం ఎలాగయితే వార్‌ గేమ్స్‌ను నిర్వహిస్తారో, అలాగే జెమ్స్‌ గేమ్స్‌ను నిర్వహించాలి. అణ్వస్త్రాలను మార్గమధ్యంలోనే విధ్వంసం చేసే శస్త్రాలపై మనం ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాం. వైరస్‌ నిరోధక వ్యవస్థ కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టడం లేదు. పర్యవసానంగా రానున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేం’ అని బిల్‌ గేట్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన హెచ్చరికలను ప్రపంచ దేశాలు పరిగణలోకి తీసుకొని ఉన్నట్లయితే నేడు కరోనా వైరస్‌ ఇంతగా ప్రపంచ దేశాలను భయపెట్టి ఉండేది కాదు. (భారత్‌లో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య)

బిల్‌ గేట్స్‌ గతేడాది మైక్రోసాఫ్ట్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఆయన వర్ధమాన దేశాల్లో వైరస్‌ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 2019లో నెట్‌ఫిక్స్‌ తీసిన డాక్యుమెంటరీలో కిల్లర్‌ వైరస్‌ ఒకటి  చైనాలోని ఓ సీ మార్కెట్‌ నుంచి విస్తరిస్తుందని చెప్పడం కూడా నేడు నిజమైంది. (కార్మికుల కడుపుకొడుతున్న కరోనా)

మరిన్ని వార్తలు