భూగర్భ జలాల్లో ‘ప్లాస్టిక్‌’

28 Jan, 2019 03:55 IST|Sakshi

జలచరాలకు పెద్ద ముప్పు

మన ఆహార వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం

పరిశోధనలో వెల్లడి  

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తున్న భూగర్భ జలాల్లోనూ ప్లాస్టిక్‌ భూతం ప్రవేశించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.  ‘గ్రౌండ్‌వాటర్‌’ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికాలోని రెండు జలాశయాల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌ వ్యర్ధాలు, ఔషధాలు, గృహోపకరణ వ్యర్థాలను శాస్త్రవేత్తలు  కనుగొన్నారు. ‘ప్లాస్టిక్‌ పర్యావరణంలోకి సూక్ష్మకణాలుగా విచ్ఛిన్నమవుతుంది. ఇది జలచర జీవుల నాశనానికి కారణమవుతుంది’ అని ఇలినాయిస్‌ టెక్నాలజీ సెంటర్‌ పరిశోధకుడు జాన్‌ స్కాట్‌ చెప్పారు.

ఫలితంగా మన ఆహార సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని  ఆయన అన్నారు. సున్నపురాయి పగుళ్ల ద్వారా, కొన్నిసార్లు మురుగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా కూడా భూగర్భంలోకి నీరు చేరుతుంది. అయితే, పరిశోధకులు సెయింట్‌ లూయిస్‌ మెట్రోపాలి టన్, ఇల్లినాయిస్‌ ప్రాంతాల్లో పలు భూగర్భ జల నమూనాలను సేకరించి పరీక్షించగా 15.2 శాతం ప్లాస్టిక్‌ సూక్ష్మకణాలు కనిపించాయి.  1940 నుంచి  600 కోట్ల మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు తయారైనట్లు ఒక అంచనా. అందులో కనీసం 79 శాతం పర్యావరణంలో కలిసిపోయి ఉంటుందని అనుకుంటున్నామని స్కాట్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు