పరాయిదేశం కాదు.. పైకే పోతారు..!

29 May, 2019 20:21 IST|Sakshi

మెలీలియా : అక్రమంగా పరదేశంలోకి చొరబడదామనుకున్న కొందరు ఆఫ్రికన్లు ప్రాణాలను పణంగా పెట్టారు. పోలీసుల చేతికి చిక్కకుండా ఉండేందుకు కారు, లారీ యాక్సిల్‌ పట్టుకుని ప్రయాణం సాగించారు. చివరికి స్పెయిన్‌ బోర్డర్‌ పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మొరాకో.. మెలీలియా సరిహద్దుల్లో శనివారం ఉదయం వెలుగుచూసింది. వివరాలు.. ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకో నుంచి దానిని ఆనుకుని ఉన్న స్పెయిన్‌ అధీనంలోని మెలీలియా నగరంలోకి చొరబడేందుకు నలుగురు వ్యక్తులు.. కారు ఇంజన్‌లో, లారీ యాక్సిల్‌ పట్టుకుని ప్రయాణం చేశారు. మెలీలియా సరిహద్దుల్లో స్పెయిన్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పట్టుబడిన నలుగురితో పాటు వారికి సాయం చేసిన వాహన డ్రైవర్లను కూడా అరెస్టు చేశారు. అయితే, ప్రయాణం సందర్భంగా అస్వస్థతకు గురైన ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించారు. ‘నలుగురు వ్యక్తులు వేర్వేరు వాహనాల్లో దొంగచాటుగా మా నగరంలోకి చొరబడేందుకు యత్నించగా పట్టుకున్నాం. వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు. వాహనాల ఇంజన్ల నుంచి వెలువడే కాలుష్యకారక పొగతో వారు మరణించే అవకాశాలున్నాయి. వారంతా కోనాక్రీ, గినియా దేశస్తులుగా అనుమానిస్తున్నాం. అక్రమ వలసదారులకు మొరాకో సరిహద్దులు అడ్డాగా మారిపోయాయి. మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై తదుపరి విచారణ చేపడతాం’ అని సరిహద్దు పోలీస్‌ అధికారొకరు తెలిపారు. పట్టుబడిన వారిలో ముగ్గురు 20-22 ఏళ్ల వయసున్న పురుషులు కాగా ఒక 15 ఏళ్ల యువతి కూడా ఉండటం విచారకరం.

మరిన్ని వార్తలు