ఒకటోసారి... రెండోసారి... మూడోసారి!

24 Nov, 2017 19:49 IST|Sakshi

900 దినార్లు...
నా పాట 1,000
1,100.. మరొక బిడ్డర్‌
1,200 లిబియా దినార్లు... 
ఓకే...డీల్‌ డన్‌
1,200 దినార్లు అంటే రూపాయల్లో 52 వేలు
ఇది ఏ పాత కారో, ఫర్నిచరో, కొద్ది గజాల స్థలానికో జరిగిన వేలంపాట కాదు...
మధ్యయుగాలను గుర్తుకుతెస్తూ... 2017లో లిబియాలో జరుగుతున్న అమానవీయ వేలం
మనుషుల వేలం... మీరు చదివింది నిజమే
బానిసలుగా మనుషులను అమ్ముతున్న దారుణం

పైన పేర్కొన్న 52 వేల రూపాయలు... ఇద్దరు నల్లజాతీయులను బానిసలుగా కొనుక్కోవడానికి వారి కొత్త యజమాని పాడిన పాట. అంటే ఒక్కరి ధర 26 వేల రూపాయలు. ‘కందకాలు తవ్వడానికి మనిషి కావాలా? ఇదిగో బలిష్టుడు, ఆజానుబావుడు... బాగా పనికొస్తాడు’ ఇదీ వేలం వేస్తున్న వ్యక్తి తను అమ్ముతున్న ‘సరుకు’ గురించి చేస్తున్న అభివర్ణన. లిబియా రాజధాని ట్రిపోలి శివార్లలో సీఎన్‌ఎన్‌ వార్తా సంస్థ రహస్య కెమేరాలతో దీన్ని రికార్డు చేసింది. జరుగుతున్న ఘోరాన్ని ప్రపంచానికి చాటింది.

ఎవరు వీరు...
పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా దేశాల్లో పేదరికం, అంతర్గత కలహాలు, అస్థిరత కారణంగా... బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ యూరోప్‌కు పయనమవుతుంటారు శరణార్థులు. బంగ్లాదేశీలు కూడా ఎక్కువే ఉంటారు. వీరు రోడ్డు మార్గం ద్వారా అక్రమంగా దేశాల సరిహద్దులు దాటుతూ లిబియాకు చేరుకుంటారు. లిబియా నుంచి మధ్యధరా సముద్రం మీదుగా ఇటలీ, ఇతర యూరోప్‌ దేశాలకు చేరుకొని కొత్త జీవితం గడపాలనేది వీరి ఆశ. దీనికోసం మనుషులను అక్రమంగా రవాణా చేసే ముఠాలకు భారీ మొత్తంలో ఫీజులు చెల్లిస్తుంటారు. లిబియా చేరుకొన్న వీరు ప్రాణాలకు తెగించి చిన్నచిన్న పడవల్లో కిక్కిరిసి ప్రయాణిస్తూ ప్రాణాలకు తెగించి మధ్యధరా సముద్రం దాటే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వేలమంది సముద్రంలో మునిగి చనిపోతుంటారు. స్వచ్ఛంద సంస్థలు నడిపే బోట్లు కొందరిని కాపాడుతున్నాయి. అక్రమ వలసదారులు, శరణార్థుల తాకిడి ఎక్కువై... యూరోప్‌ దేశాలు తమ తీర ప్రాంతాల్లో గస్తీ పెంచాయి. దాంతో అదృష్టం కొద్దీ యూరోప్‌ తీరానికి చేరినా... అక్కడ పట్టుబడి తిరిగి స్వదేశానికి తిరిగి వస్తుంటారు.

లిబియానే ఎందుకు?
2011లో లిబియాలో ప్రజా తిరుగుబాటుతో గడాఫీ హతమయ్యాక ఆ దేశంలో అస్థిరత నెలకొంది. ఐక్యరాజ్యసమితి అండతో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నా... దేశమంతటా దీని పాలన లేదు. దీంతో మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాలు లిబియాను కేంద్రంగా చేసుకొని తమ దందా కొనసాగిస్తున్నాయి. యూరో కలలుగంటున్న పేద ఆఫ్రికన్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.

ఎక్కడెక్కడ...
మధ్యధరా తీరానికి సమీపంలో ఉన్న జువారా, సబ్రాత్, కాసిల్‌వెర్డే, గర్యాన్, అల్‌రుజ్బాన్, అల్‌జింటాన్, కబావ్, గడామిస్‌... తదితర పట్టణాల్లో ఈ ముఠాలు ప్రైవేటు నిర్భంద కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. యూరోప్‌కు చేర్చుతామని ఒప్పందం కుదుర్చుకొని తెచ్చిన వారిని ఏదో ఒక కారణంగా నిర్భందిస్తున్నాయి. ఇచ్చిన మొత్తం ప్రయాణానికి సరిపోవడం లేదని, మధ్యవర్తులు వీరి తాలూకు మొత్తం డబ్బును తమకు చెల్లించలేదని... సాకులు చూపుతారు. గాలి, వెలుతురు సరిగాలేని గోదాముల్లో వీరిని కుక్కుతారు. కనీస సదుపాయాలుండవు. సరిగా తిండి పెట్టరు. ఎదురుతిరిగితే చిత్రహింసలే. ఇలా నిర్భందించిన వారి ఇళ్లకు ఫోన్లు చేస్తూ... తాము చెప్పినంత డబ్బు చెల్లిస్తే మీవాడిని విడిచిపెడతామని బేరం పెడతారు. అలా డబ్బు గుంజుతారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి వీరి చేతిలో పెట్టిన నిర్భాగ్యులు ఏమీ చెల్లించకపోతే... వారిని బానిసల వేలం మార్కెట్లకు తరలించి అమ్మేస్తారు. పులలను బోనులో పెట్టినట్లు... వీరిని ప్రదర్శనకు పెట్టి వేలం వేస్తారు. నియమిత కాలానికి వీరిని వేలం వేసి... ఆ సమయం ముగిసిన తర్వాత మళ్లీ వెనక్కితెస్తారు. కిందటిసారి వేలంలో వచ్చిన దానితో బాకీ తీరలేదని చెప్పి మళ్లీ వేలానికి పెడతారు. 

ఎంతమంది...
ప్రస్తుతం లిబియాలో ఏడు నుంచి పది లక్షల మంది శరణార్థులు ఉంటారని ఐక్యరాజ్యసమితి అంచనా. తగిన పత్రాలు లేకుండా దొరికిన వారు, ముఠాల నిర్భందం నుంచి కాపాడిన వారు కలిపి మొత్తం  25,000 మంది ఇప్పుడు లిబియా ప్రభుత్వం నిర్వహిస్తున్న శరణార్థి నిర్భంద కేంద్రాల్లో ఉన్నారు. వీరిని స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నా... వారి మాతృదేశాలు సహకరించడం లేదని, జాతీయతను నిరూపించే ఆధారాలు చూపాలని అంటున్నాయనేది లిబియా ఆరోపణ. లిబియాలోని దుర్భర పరిస్థితులను చూశాక... స్వదేశానికి తిరిగి వెళ్లడానికి 8,800 (ఈ ఏడాది ఇప్పటివరకు) స్వచ్చంధంగా ముందుకు వచ్చారని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఒఎం) సంస్థ తెలిపింది. వీరిని విమానాల్లో స్వదేశాలకు పంపింది. అక్రమ రవాణాల ముఠాల నిర్భంధంలో బానిసలుగా మగ్గుతున్న వారు వేలల్లోనే ఉంటారని అంచనా. సీఎన్‌ఎన్‌ చిత్రీకరించి ప్రసారం చేసిన వీడియోతో ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బానిసల వేలంపై దర్యాప్తు జరుపుతామని లిబియా ప్రభుత్వం ప్రకటించింది.

మానవత్వానికే మచ్చ
శరణార్థులకు బానిసలుగా అమ్ముతున్నారనే విషయం భీతిగొల్పుతోంది. ఇది మానవత్వానికే తీరని మచ్చ. అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా దీన్ని అడ్డుకోవాలి. చట్టపరమైన వలసలను ప్రొత్సహించాలి.
– అంటోనియో గుటెరస్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌

నన్ను అమ్మారు...
నైజీరియాలో పెచ్చరిల్చిన అవినీతి, పేదరికంతో యూరోప్‌కు వలస వెళ్లాలని ఇంటిని వీడాను. ఉన్నదంతా ఊడ్చి లక్షా 80 వేల రూపాయలు స్మగ్లర్ల చేతుల్లో పోశాను. లిబియాకు చేరుకున్నాక నరకం చూపించారు. వారి నిర్భందంలో ఉన్నవారి శరీరాలను ఒకసారి పరిశీలించి చూస్తే గాయాల తాలూకు మచ్చలు కనిపిస్తాయి. సరైన తిండి పెట్టరు. చిత్రహింసలకు గురిచేస్తారు. డబ్బు బాకీపడ్డానని నన్ను పలుమార్లు వేలం వేశారు. మా ఇంటికి ఫోన్‌ చేసి డబ్బు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చివరకు నన్ను వదిలేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా తిరిగి స్వదేశానికి వెళ్లి జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి ఆరంభించాలి. నాకింతే రాసి ఉంది. – 21 ఏళ్ల విక్టరీ, నైజీరియన్‌

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు