‘నా పిల్లలు బతికి ఉంటే చాలు.. ఇంకేం వద్దు’

27 Nov, 2018 09:56 IST|Sakshi
తన పిల్లలను రక్షించుకునేందుకు పరిగెడుతున్న మెజా

వాషింగ్టన్‌ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో మరోసారి అలజడి చెలరేగుతోంది. మధ్య అమెరికాకు చెందిన శరణార్థులు తమ దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు యూఎస్‌ సరిహద్దు భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలపై కూడా భాష్పవాయువు ప్రయోగించడంతో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ క్రమంలో వలసదారుల్ని వెనక్కి పంపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్‌’  విధానం మరోసారి చర్చనీయాంశమైంది.

ఈ ఫొటోలు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి...
తమను నిలువరించేందుకు సరిహద్దు అధికారులు ప్రయోగిస్తున్న టియర్‌ గ్యాస్‌ నుంచి తమతో పాటు పిల్లల్ని రక్షించుకోవడం శరణార్థులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో వాళ్లు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) మరోసారి విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా మారియా మెజా అనే మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి శరణార్థుల శిబిరంవైపునకు పరిగెత్తుతున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నాలాంటి వాళ్లు ఇంకెందరో...
‘హోండురస్‌లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. అందుకే నా ఐదుగురు పిల్లలను తీసుకుని మెక్సికో సరిహద్దులోని తిజువానా పట్టణంలో ఓ వారం పాటు బస చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ క్రమంలోనే మెక్సికో సరిహద్దులకు చేరుకున్నాను. దీంతో మెక్సికో పోలీసులు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రమే చేశారు. కానీ అమెరికా భద్రతా సిబ్బంది మాత్రం ఒక్కసారిగా టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దుల్లో ఉన్న వాళ్లంతా చెల్లాచెదురయ్యారు. టియర్‌ గ్యాస్‌ ప్రభావంతో నా కుమారుడు సొమ్మసిల్లి పడిపోయాడు. వాడితో పాటు నా కూతుళ్ల పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చచ్చిపోతామేమోనని భయం వేసింది. వెంటనే తేరుకుని అందరినీ పొదిమి పట్టుకుని శరణార్థుల శిబిరంవైపునకు పరిగెత్తాను.

అయితే ఒక విషయం... ఒకవేళ అమెరికాలో మా లాంటి శరణార్థులకు ఆశ్రయం లేదని తెలిస్తే ఇటువైపుగా వచ్చేవాళ్లమే కాదు. వాళ్లు మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూశారు. పిల్లలనే జాలి కూడా లేదు వాళ్లకు. నిజంగా దేవుడు అనే వాడు ఒకడుంటే ఇక్కడ కాకపోతే మరోచోట ఆశ్రయం దొరుకుతుంది. ఎక్కడున్నా సరే నా పిల్లలు బతికి ఉంటే చాలు.. నాకు ఇంకేం అక్కర్లేదు’ అని మధ్య అమెరికా దేశం హోండరస్‌కు చెందిన మహిళ మెజా తన భయానక అనుభవాలు వెల్లడించారు. మెజా ప్రస్తుతం తన ఐదుగురు పిల్లలతో కలిసి మెక్సికోలోని తిజువానా పట్టణంలోని శరణార్థుల శిబిరంలో ఆశ్రయం పొందుతున్నారు. (అమెరికా వెళ్తే అంతే మరి..)

వాళ్లని వెనక్కి పంపివేయాల్సిందే : ట్రంప్‌
వివిధ దేశాలకు చెందిన సుమారు 5,200 మంది ప్రజలు మెక్సికో సరిహద్దు గుండా అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అమెరికా సరిహద్దు విభాగం అధికారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరంతా తిజువానాలో ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలసదారులందరినీ తమ తమ దేశాలకు పంపివేయాలంటూ మెక్సికో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు శరణార్థులు కారని, అమెరికాలో అక్రమంగా చొరబడి ఆర్థికంగా లబ్ది పొందాలని చూస్తున్న ఆశావాదులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వారిని అమెరికా ఎప్పుడూ కేవలం ఆర్థిక వలసదారులుగా మాత్రమే పరిగణిస్తుందని.. శరణార్థులుగా గుర్తించదని ఉద్ఘాటించారు.  అంతేకాకుండా వలసదారులపై తమ అధికారులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారన్న వార్తల్ని కొట్టిపారేశారు. హోండురస్‌లోని పరిస్థితులను తమ దేశానికి ఆపాదిస్తూ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. (జీరో టాలరెన్స్‌... అమెరికా వివరణ)

కాగా, ట్రంప్‌ వ్యాఖ్యలపై అమెరికా చట్టసభ ప్రతినిధులు, మానవ హక్కుల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న హింసకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆయనకు కనపడటం లేదా అని మండిపడుతున్నారు. (జీరో టాలరెన్స్‌కి  భారతీయులూ బలి)

>
మరిన్ని వార్తలు