విడాకులకు దారి తీసిన నల్లజాతీయుడు మృతి

30 May, 2020 15:44 IST|Sakshi

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పోలీసులు చేతిలో అత్యంత దారుణంగా మృతిచెందిన నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్‌కు మద్దతుగా వేలాదిమంది ప్రజలు వీధుల్లోచ్చారు. జార్జ్‌ మృతికి కారణమైన పోలీసు అధికారి డెరెక్ చౌవిన్‌ను తక్షణమే ఉరి తీయాలంటూ నినదిస్తున్నారు. పౌర ఆందోళనలతో గత రెండు రోజులుగా అగ్రరాజ్యం అట్టుడుకుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనకు వేదికైన మినియా పోలీస్‌ స్టేషన్‌ను ఆందోళన కారులు నిప్పుపెట్టడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం ఆ తరువాత  ప్రజా ఆగ్రహం దేశ వ్యాప్తంగా విస్తరించడం గంటల్లోనే జరిగిపోయింది. ఈ క్రమంలోనే స్థానిక ప్రభుత్వం ప్రజల ఆందోళనకు తలగ్గొంది. జార్జ్‌ను అత్యంత అమానుషంగా హతమార్చిన పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్‌‌పై హత్యా కేసును నమోదు చేసి, కటకటాల వెనక్కి పంపింది. (ఆందోళనలతో అట్టుడుకుతున్న అమెరికా)

మరో ముగ్గురు అధికారులపై థర్డ్‌డిగ్రీ అభియోగాలను నమోదు చేసింది. ఈ నలుగురు అధికారులను శనివారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలావుండగా.. జార్జ్‌ ప్లాయిడ్‌ మెడపై మోకాలు పెట్టి అత్యంత అమానుషంగా ప్రవర్తించిన డెరెక్‌ భార్య కీలై చౌవిన్‌ అతని నుంచి విడాకులు కోరారు. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటనకు పాల్పడిన చౌవిన్‌తో తన వివాహాన్ని రద్దు చేయాలని ఆమె కోరినట్లు తెలిసింది. ఈ మేరకు కీలై తరఫు న్యాయవాది స్థానిక కోర్టులో విడాకులను కోరుతూ పత్రాలను సైతం దాఖలు చేశారు. ఈ మేరకు అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు