మిస్‌ టీన్‌ ఆసియా వరల్డ్‌ కిరీటం మన తెలుగమ్మాయి​కే

22 Aug, 2019 20:08 IST|Sakshi

టెక్సాస్‌ : మిస్‌ టీన్‌ ఆసియా వరల్డ్‌ 2019-21 అందాల పోటీలో డల్లాస్‌కు చెందిన తెలుగమ్మాయి సైషా కర్రి విజేతగా నిలిచింది. టెక్సాస్‌లోని ప్లానో ఈవెన్ సెంటర్‌లో జరిగిన వేడుకలో అందాల రాణి కిరీటం సొంతం చేసుకుంది. ఆసియా అమెరికన్ మహిళలను విద్యావంతులను చేసి వారి సాధికారతకు కృషి చేయడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశం. మహిళల విజయాలను గుర్తించి వాళ్లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన సాంస్కృతిక, స్కాలర్‌షిప్‌ ఈవెంట్‌ ఇది. భారత్‌తో పాటు చైనా, ఫిలిప్పైన్స్‌, వియత్నాం సహా ఇతర ఆసియా దేశాల భిన్న సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేసే వీలును కల్పిస్తుంది. అదేవిధంగా ఆసియన్‌ అమెరికన్‌ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.

కాగా సైషా తల్లిదండ్రులు శశి కర్రి, నాగ్ కర్రి అమెరికాలో ఐటీరంగ నిపుణులుగా పనిచేస్తున్నారు. ఇక సైషాకు చిన్నప్పటి నుంచి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ ఎక్కువ. గత 11 ఏళ్లుగా  కథక్‌ నేర్చుకుంటున్న ఆమె.. ఈ ఏడాది నవంబరులో ఆరంగేట్రం చేయనుంది. అదే విధంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటుంది. ‘ఛారిటబుల్ స్టూడెంట్స్ ఆఫ్ అమెరికా’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వారాంతరాల్లో అన్నదాత ఛారిటీ సంస్థతో కలిసి నేపాల్‌, భూటాన్‌ శరణార్థులకు ఆహారం, దుస్తులతో పాటు ఇతర వస్తువులు వారికి అందేలా కృషి చేస్తోంది. చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలతో పాటు, వ్యాపార రంగాల్లో ఆసక్తి కనబరిచే లక్షణాలే సైషాకు ఈ అందాల కిరీటాన్ని కట్టబెట్టాయి. 
 
 

మరిన్ని వార్తలు