పారిపోండి.. జపనీయులను వణికించిన కిమ్‌

15 Sep, 2017 09:32 IST|Sakshi
పారిపోండి.. జపనీయులను వణికించిన కిమ్‌

టోక్యో : సాధ్యమైనంతమేరకు కేకలు, పెద్ద పెద్ద అరుపులు.. అంతకు మించి భారీ లౌడ్‌ స్పీకర్ల శబ్దాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.. అణు క్షిపణి వస్తోంది.. అణు క్షిపణి వస్తోంది అంటూ అందులో హాహాకారాలు మాదిరి హెచ్చరికలు వినిపించాయి. వీలైతే భవనాల్లోకి వెళ్లండి లేదంటే అండర్‌ గ్రౌండ్‌లోకి వెళ్లిపోండి అంటూ సూచనలు వచ్చాయి. ఇవి సరిగ్గా ఉత్తర కొరియా మరోసారి ప్రపంచ హెచ్చరికలు లెక్కచేయకుండా ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించినప్పుడు అది వెళ్లిన జపాన్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు వ్యక్తం చేసిన భయాందోళనలు.

ఉదయం నుంచే ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష చేస్తుందట అంటూ అత్యవసర ఫోన్‌ కాల్‌లు చేసుకోవడం, లౌడ్‌ స్పీకర్ల ద్వారా సమాచారం అందించుకోవడం చేసుకున్నారు. దాదాపు జపాన్‌లోని మిలియన్ల మంది వేకువ జామునే వణికి పోయారు. ప్రపంచ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి ఖండాంతర అణు క్షిపణి ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. తాజాగా చేసిన క్షిపణి లక్షిత దూరం 3,700 కిలోమీటర్లు. అంటే సరిగ్గా అమెరికాకు చెందిన భూభాగం గ్వామ్‌ను చేరి ధ్వంసం చేసేంత. అయితే, ఈ క్షిపణిని మరోసారి కూడా ఉత్తర కొరియా జపాన్‌ మీదుగానే ప్రయోగించింది.

దీంతో అది ఎక్కడ తమపై కూలిపోతుందో అని జపాన్‌ ప్రజలు బెంబేలెత్తిపోయారు. వారి భయం ప్రకారమే అది నిజంగా పడితే జరిగే ధ్వంసం ఊహించలేం. ముఖ్యంగా ఎరిమో, హోక్కైడోవంటి నగరాల ప్రజలు మాత్రం దాదాపు ప్రాణాలు అరచేతబట్టుకున్నారంట, 'ఒక భారీ క్షిపణి తమ నగరంపై నుంచి ప్రయాణిస్తుందనే విషయం విని మేం నిలకడగా ఉండలేకపోయాం. అది వినడానికే భయంగా ఉంది' అని ఓ జపాన్‌ పౌరుడు చెప్పగా..

నిజంగా మేం చాలా భయపడ్డాం. అది 2000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌లో పడుతుందని విన్నాను. సరిగ్గా అది వెళ్లే మార్గంలో పడిపోయే మార్గంలో నావి 16 నౌకలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా సురక్షితమైన భవనాల్లోకి వెళ్లండి అని చెప్పింది.. కానీ, మేం ఆ సమయంలో ఏం చేయలేకపోయాం. ఇప్పటకే రెండుసార్లు ఇలా జరిగింది. ఇక నుంచి మాకు విశ్రాంతి ఉండదేమో' అంటూ మరొకరు చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరు ఉత్తర కొరియా క్షిపణితో దాదాపు వణికిపోయారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు