ఫిబ్రవరి నాటికి రోజుకు 2.87 లక్షల కేసులు

9 Jul, 2020 12:46 IST|Sakshi

న్యూయార్క్‌ : భారత్‌లో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోంది. అడ్డూఅదుపూ లేకుండా విస్తరిస్తోన్న మహమ్మారి రాబోయే రోజుల్లో స్వైరవిహారం చేస్తుందనే అంంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ రానిపక్షంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భారత్‌లో రోజుకు 2,87,000 పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తాయని అమెరికాకు చెందిన మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అంచనా వేశారు. ఎంఐటీ పరిశోధకులు హజిర్‌ రెహ్మాందాద్‌, టీవై లిమ్‌, జాన్‌ స్టెర్‌మన్‌లు ఎస్‌ఈఐఆర్‌ (అనుమానిత, రిస్క్‌, వైరస్‌, రికవరీ) పద్ధతిలో ఈ విశ్లేషణ చేపట్టారు. అంటువ్యాధుల నిపుణులు శాస్త్రీయంగా ఉపయోగించే నిర్ధిష్ట గణాంక పద్ధతిగా భావించే ఎస్‌ఈఐఆర్‌ మోడల్‌ను వీరు అనుసరించి లెక్కగట్టారు.  కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకుంటే 2021 మే నాటికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదవుతాయని పరిశోధక బృందం తేల్చింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు భారత్‌లోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదవుతాయని తర్వాతి స్ధానంలో అమెరికా (రోజుకు 95,000 కేసులు), దక్షిణాఫ్రికా (21,000 కేసులు), ఇరాన్‌ (17,000 కేసులు)లు నిలుస్తాయని ఎంఐటీ పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుతం టెస్టింగ్‌ జరుగుతున్న తీరుతెన్నులు, వాటి వేగం పెరిగే అవకాశం, కాంటాక్ట్‌ రేటను పరిగణనలోకి తీసుకుని పరిశోధకులు ఈ గణాంకాలను వెల్లడించారు. ఇక కరోనా టెస్టులు ప్రస్తుత స్ధాయిలోనే ఉండి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్‌ సంక్రమించే రేటు స్ధిరంగా ఉంటే కేసుల సంఖ్య, మరణాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధక బృందం పేర్కొంది. అధికారిక కేసుల సంఖ్య కంటే వాస్తవ కేసులు అధికంగా ఉంటాయని, అత్యధికులు వ్యాధిబారిన పడే అనుమానితులేనని స్పష్టం చేసింది. మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో హెర్డ్‌ ఇమ్యూనిటీని ఎంచుకోవడం సరైందికాదని పరిశోధకులు పేర్కొన్నారు.చదవండి : కోవిడ్‌-19 అప్‌డేట్‌ : 24 గంటల్లో 25,000 కేసులు

మరిన్ని వార్తలు