చైనా మొబైల్ ఏ రేంజ్‌లో పేలిందంటే..!

2 Feb, 2018 20:01 IST|Sakshi

ఏకంగా ఓ బాలుడు ఓ కన్ను, చేతివేలు కోల్పోయాడు

బీజింగ్: చైనా మొబైల్స్ పేలుతున్నాయి అని సాధారణంగా వింటుంటాం. కానీ ఓ చైనా మొబైల్ మాత్రం ఓ రేంజ్‌లో పేలిపోవడం ఓ బాలుడి పాలిట శాపంగా మారింది. ఛార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ పేలడంతో బాలుడు(12) ఏకంగా ఓ కన్ను చూపు కోల్పోయాడు. అంతటితో పాటు అతడి కుడిచేతి చూపుడు వేలు విరిగి ముక్కలై చేతి నుంచి వేరయింది. ఈ విషాద ఘటన చైనాలో ఇటీవల చోటు చేసుకుంది. 

దక్షిణ చైనాలోని గ్వాంగ్జి ప్రావిన్స్‌ ప్రాంతంలో మెంజ్ జిషూ(12) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రోజు తన హువా టాంగ్ వీటీ-వీ59 మోడల్ మొబైల్‌ను ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టాడు జిషూ. కొద్దిసేపు తర్వాత ఫోన్‌ను ఛార్జింగ్ తీసేయాలని చూడగా.. చేతిలోకి తీసుకున్న వెంటనే భారీ శబ్ధంతో ఆ మొబైల్ పేలిపోయింది. ప్లాస్టిక్ ముక్కలు బాలుడి తల, కంట్లోకి చొచ్చుకెళ్లడంతో క్షణాల్లో కుప్పకూలిన బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. కొంత సమయం తర్వాత బాబుని చూడగా.. అతడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే తమ్ముడు జిషూని ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు బాలుడి అక్క తెలిపారు. 

దాదాపు ఐదు గంటలపాటు తీవ్రంగా శ్రమించి సర్జరీ చేసి జిషూని బతికించినట్లు డాక్టర్ లాన్ టియాన్‌బింగ్ చెప్పారు. హాస్పిటల్‌కు తెచ్చేటప్పటికే బాలుడి కుడిచేతి చూపుడువేలు లేదని, ఇప్పుడు సర్జరీ చేసినా అతికించడం కుదరదని పేర్కొన్నారు. బాలుడి తల, కన్ను, ముఖం భాగాల్లోకి వెళ్లిన ప్లాస్టిక్ ముక్కలను అతికష్టమ్మీద తొలగించాం, అతడి ప్రాణాలకు ముప్పులేదన్నారు. భవిష్యత్తులో అతడి కుడిచేతి యథావిధిగా పని చేస్తుందని చెప్పిన డాక్టర్లు.. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. మొబైల్ పేలిన ఘటనపై టాంగ్ వీటీ కంపెనీ ఇంకా స్పందించలేదని సమాచారం.

 

మరిన్ని వార్తలు