సాంకేతికతతో కొత్త ప్రపంచం

27 Jul, 2018 04:33 IST|Sakshi
జోహన్నెస్‌బర్గ్‌లో సదస్సు సందర్భంగా బ్రిక్స్‌ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ

బ్రిక్స్‌ దేశాలకు మోదీ పిలుపు

జోహన్నెస్‌బర్గ్‌: సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, బహుముఖ సహకారంతో మెరుగైన ప్రపంచాన్ని నిర్మించొచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న నూతన పారిశ్రామిక సాంకేతికత, డిజిటల్‌ విధానాల జోక్యం అవకాశాలు సృష్టించడమే కాకుండా సవాళ్లు విసురుతాయన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్‌ దేశాల పదో శిఖరాగ్ర భేటీ ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగించారు.

నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం బ్రిక్స్‌ దేశాలతో కలసిపనిచేయాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోందని అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో మూలధనం కన్నా ప్రతిభే ముఖ్యమని నొక్కిచెప్పారు. ఈ తరంలో ‘అత్యుత్తమ నైపుణ్యం–కొద్ది పని’ కొత్త విధానంగా మారిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామిక తయారీ, డిజైన్, ఉత్పాదకతల్లో నాలుగో పారిశ్రామిక విప్లవం మౌలిక మార్పులు తీసుకొస్తుందని పేర్కొన్నారు. బహుళత్వ విధానాలు, అంతర్జాతీయ వాణిజ్యానికి భారత్‌ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

ఉగ్రపోరుకు సమగ్ర విధానం: బ్రిక్స్‌
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిపై పోరాడటానికి సమగ్ర విధానం అవలంబించాలని బ్రిక్స్‌ దేశాలు నిర్ణయించాయి. బ్రిక్స్‌ దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రదాడులను సదస్సు డిక్లరేషన్‌ ఖండించింది. అవినీతి కూడా ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారిందని పేర్కొంది.  

జిన్‌పింగ్‌తో మోదీ భేటీ..
బిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. తమ భేటీ ఇరు దేశాల సంబంధాలకు, సహకారానికి కొత్త శక్తినిస్తుందని మోదీ అన్నారు. మరోవైపు, ఆతిథ్య దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాతో కూడా వేరుగా సమావేశమైన మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు