లండన్ ఎన్నికల్లోనూ మోదీ కార్డ్!

5 May, 2016 20:18 IST|Sakshi
లండన్ ఎన్నికల్లోనూ మోదీ కార్డ్!

ఎక్కడ లండన్.. ఎక్కడ మోదీ! చాలా దూరం ఉంది కదూ.. కానీ లండన్‌లో జరుగుతున్న మేయర్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి మోదీ కార్డును వాడుతున్నాడట. అవును.. తన ప్రత్యర్థి మీద పైచేయి సాధించడం కోసం అక్కడ కన్సర్వేటివ్ పార్టీ తరఫున పోటీచేస్తున్న జాక్ గోల్డ్‌స్మిత్ ఇప్పుడు మోదీ జపం చేస్తూ.. ఆ కార్డునే ఉపయోగిస్తున్నాడు. దానికి కారణం లేకపోలేదు.. అతడి మీద పోటీ చేస్తున్న పాకిస్థానీ మూలాలున్న సాదిక్ ఖాన్ ప్రస్తుతం కొంత ముందంజలో ఉన్నారు. దాంతో లండన్‌ నగరంలో ఉన్న హిందూ, సిక్కు ఓటర్ల మనసు గెలుచుకుని, వాళ్ల ఓట్లతో కొంత ముందడుగు వేద్దామని చూస్తున్న గోల్డ్‌స్మిత్ మోదీ జపం అందుకున్నాడు. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్ నగరాల్లో ఇప్పుడు మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటిలో లండన్ మేయర్‌ పదవికే ఎక్కువ క్రేజ్ ఉంది.

ప్రస్తుత ట్రెండును బట్టి 2005 నుంచి టూటింగ్ ఎంపీగా వ్యవహరిస్తున్న ఖాన్ విజేత అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన తండ్రి మాజీ బస్సు డ్రైవర్. 2009-10 సంవత్సరాల మధ్య నాటి ప్రధాని గార్డన్ బ్రౌన్ మంత్రివర్గంలో ఖాన్ రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కేబినెట్ సమావేశాలకు హాజరైన తొలి ముస్లిం మంత్రిగా కూడా ఆయన పేరుపొందారు. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలలో ఖాన్‌కు 48 శాతం మంది మద్దతు లభించగా, గోల్డ్‌స్మిత్‌కు మాత్రం 32 శాతమే వచ్చింది. దాంతో ఎలాగోలా హిందూ, సిక్కు ఓట్లను పొందితే ఈ మార్జిన్ కొంతవరకు తగ్గుతుందన్న ఆశతో గోల్డ్‌స్మిత్ ఇప్పుడు మోదీ మంత్రం జపిస్తూ.. భారతీయులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడట!!

మరిన్ని వార్తలు